Hyderabad News: హైదరాబాద్‌లోని అమీన్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల గర్భిణీ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. యువతి బంధువులే ఆమెను అపహరించారు. యువతి కిడ్నాప్‌నకు ప్రేమ వివాహమే కారణం అని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయి చరణ్, అనుసంద్ర అనే యువతి 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి అమీన్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అనుసంద్ర ప్రస్తుతం 3 నెలల గర్భిణి. అయితే, వీరి ప్రేమ వివాహం అనుసంద్ర తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అనుసంద్రను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారు. మెడపై కత్తి పెట్టి, ఖర్చీఫ్‌లో క్లోరోఫామ్ పెట్టి అనుసంద్రని కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే కిడ్నాప్‌కు గురైన అనుసంద్ర చాలా చాక్యచక్యంగా వ్యవహరించి భర్త సాయిచరణ్‌కు లొకేష్ షేర్ చేసింది.
సాయిచరణ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అలర్ట్ అయ్యారు. లోకేషన్ ఆధారంగా పోలీసులు, సాయిచరణ్.. ఓ అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుసంద్రను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. ఇదిలాఉంటే.. అనుసంద్ర కిడ్నాప్ అయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని సాయిచరణ్ ఆరోపించాడు. దాంతో 100కు కాల్ చేసి పోలీసుల సాయం తీసుకున్నానని సాయి చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం కిడ్నాపర్లు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Tokyo Olympics 2021: రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!
New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..