Telangana: అయ్యో పాపం.. లండన్ నుంచి వచ్చి పెళ్లి చేయాలని లవర్ ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత ..

అతడు లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుని జీవించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలో యువతికి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో శ్రీకాంత్ లండన్ నుంచి వచ్చి యువతి ఇంటికి వెళ్లాడు. అయినా ఆమె పేరెంట్స్ మాత్రం పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో అతడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

Telangana: అయ్యో పాపం.. లండన్ నుంచి వచ్చి పెళ్లి చేయాలని లవర్ ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత ..
London Software Engineer

Updated on: Nov 29, 2025 | 9:02 AM

ఉన్నత చదువులు చదివి, లండన్‌లో మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడాలని కలలు కన్న ఒక యువకుడి జీవితం ప్రేమ వల్ల విషాదంగా ముగిసింది. తనను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో జరిగింది. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాజారెడ్డి – రాజవ్వ దంపతుల చిన్న కొడకైన శ్రీకాంత్.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. అయితే యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని, ఆమె కోరిక మేరకు 5 నెలల క్రితం శ్రీకాంత్ స్వదేశానికి వచ్చాడు.

ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ శ్రీకాంత్‌తో పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 7న సదరు యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీకాంత్.. పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాంత్‌ను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అప్పుడే పోలీసులు బాధితుడి స్టేట్‌మెంట్ నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 27న శ్రీకాంత్ తుది శ్వాస విడిచాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ముట్టడి

శ్రీకాంత్ మృతితో ఆగ్రహానికి గురైన అతని కుటుంబ సభ్యులు గురువారం రాత్రి యువతి ఇంటిపై దాడికి దిగారు. మరోవైపు పోలీసులు తమ కేసు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. శుక్రవారం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో శ్రీకాంత్ కుటుంబానికి మద్దతుగా ముందుకు వచ్చారు. మృతదేహం ఉన్న ఫ్రీజర్‌తో సహా గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో, ఆగ్రహించిన జనం మృతదేహం ఉన్న ఫ్రీజర్‌ను పోలీసు వాహనంపైకి ఎక్కించి ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి కలుగజేసుకుని గ్రామస్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.