Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా
ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహం సగం వరకు కాలిపోయి ఉంది. అంతేకాకుండా కాష్టం సమీపంలో పసుపు, కుంకుమ.. ఇతర ముగ్గులు వేశారు. మంత్రాల కారణంగా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో మంగళవారం రాత్రి ఓ విచిత్ర సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మోతె గ్రామానికి చెందిన యువతి బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 12న ఇంట్లో పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈనెల 14న మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
మరుసటి రోజు కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు వెళ్లేసరికి యువతి మృతదేహం సగమే దహనం అయింది. దీంతో మళ్లీ కర్రలు పెట్టి మృతదేహాన్ని పూర్తిగా దహనం చేశారు. మరుసటి రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసిన చోట ఉన్న అస్తికలను తీసుకెళ్లి క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులంతా యువతికి మంత్రాలు చేయడం వల్లే మృతిచెందిందని భావించి మంగళవారం రాత్రి యువతి కుటుంబ సభ్యులు రెండు డప్పులు, కర్రలతో మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ డప్పుల చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ డప్పుల చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించడంపై ప్రజలంతా విస్మయానికి గురయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రామం భయంతో వణికిపోతుంది. ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




