Viral Video: రాత్రి ఇంటికెళ్తుండగా ఎదురైన చిరుత పులి.. కార్మికులు తెలివిగా ఏం చేశారంటే?
నల్గొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. చిరుత ఆచూకీని గుర్తించే పనిలో పడ్డారు.

నల్గొండ జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. పీఏ పల్లి మండలం చిలకమర్రి స్టేజి వద్ద చిరుత కదలికలను గుర్తించారు AKBR వద్ద పనిచేస్తున్న కార్మికులు. వారు పనులు ముగించుకొని వాహనంలో ఇంటికి బయల్దేరగా.. మార్గమధ్యలో చిలకమర్రి స్టేజ్ వద్ద వారికి ఓ చిరుతపులి ఎదురైంది. దాన్ని చూసి మొదట కంగారుపడిన కార్మికులు.. వాహనాన్ని పక్కకు ఆపి తమ మొబైల్‌లో చిరుత దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వాహనం హారన్ కొట్టడంతో ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని కార్మికులు ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చిరుత కదలికలను గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా స్థానికంగా చిరుత సంచరిస్తుందన్న విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రైతులైతే రాత్రివేళ పొలం దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
జిల్లాలో చిరుత సంచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు స్థానిక ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. రైతులు రాత్రిపూట ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా చిరుత ఆచూకీ కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
