Telangana News: ఏడాది గడవకముందే తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే ఛార్జీలు రేపటి (ఫిబ్రవరి 1) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాల దగ్గర రద్దీ పెరిగింది. భూముల రిజిస్ట్రేషన్ కోసం క్రయవిక్రయదారులు బారులుతీరారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించి, కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం మంగళవారం నుంచి అమల్లోకి తీసుకురాబోతుంది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం.. ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గతంలో సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతేడాది జులై 22 నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేటును 50 శాతం పెంచగా.. మధ్యశ్రేణి భూముల విలువను 40శాతం.. ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30శాతం మేర పెంచింది.
ఖాళీస్థలాల కనీస ధర చదరపు గజానికి 200గా నిర్ణయించింది. వీటి విలువను కూడా 50శాతం, 40శాతం, 30 శాతంగా పెంచింది. అపార్టుమెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర 1000గా నిర్ణయించగా… కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 30 శాతం పెంచారు. దీంతో పాటు స్టాంపు డ్యూటీ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుంలను సర్కారు పెంచింది. లెటెస్ట్‌గా తీసుకున్న నిర్ణయంతో రేపటి నుంచి మరోసారి రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. ఈ సారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ స్థాయిలో పెరగనుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.
Also Read..
Budget 2022: ఆత్మ నిర్భర్ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన