చనిపోయిన మహిళ పేరుతో తప్పుడు పత్రాలు.. లేని స్థలాన్ని సృష్టించి కోట్లు దండుకున్న మాయగాళ్లు..!

భూముల ధరలు పెరగడంతో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి పేరు ఒకటే ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని మోసానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మరికొన్ని మోసాలు బయటకు వస్తున్నాయి.

చనిపోయిన మహిళ పేరుతో తప్పుడు పత్రాలు.. లేని స్థలాన్ని సృష్టించి కోట్లు దండుకున్న మాయగాళ్లు..!
Land Acquired By Creating False Documents

Edited By:

Updated on: Mar 06, 2026 | 7:37 PM

భూముల ధరలు పెరగడంతో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి పేరు ఒకటే ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని మోసానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మరికొన్ని మోసాలు బయటకు వస్తున్నాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉన్న జిల్లా సంగారెడ్డి. ఈ జిల్లాలో భూముల ధరలు హైదరాబాద్‌తో పోటీ పడుతూ ఉంటాయి. ప్రధానంగా కొల్లూరు, తెల్లాపూర్, అమీన్‌పూర్, బీరంగూడ, ఆర్సీపురం ప్రాంతాల్లో గజం లక్షల రూపాయలు పలుకుతుంది. అయితే అమీన్‌పూర్ లీక్ భూముల ధరలు ఆకాశన్నంటుతుండగా, మోసాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ముఠా ఆగడాలు ఇక్కడ స్థలం కొనాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి.

ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి దర్జాగా అంటగట్టారు. రెండున్నర కోట్ల రూపాయలు లూటీ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ భూమికి సంబంధించిన అసలు వారసులు స్థలం మీదకు రావడంతో అసలు మోసం బయట పడింది. కూకట్‌పల్లిలో నివాసం ఉండే శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని బీరంగూడలో సర్వేనెంబర్ 967లోని మల్లిఖార్జున్ నగర్ లో 324, 325 నంబర్ గల ప్లాట్లను 800 గజాలను 2024 జూన్ లో రెండున్నర కోట్లకు కొనుగోలు చేశాడు. జీడిమెట్లకు చెందిన కాసుల కృష్ణ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి శ్రీనివాస్ కి ప్లాట్ ని ఇప్పించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ప్లాట్ తీసుకున్న శ్రీనివాస్ అందులో భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని బోరు వేసి పనులు మొదలుపెట్టగానే అసలు సినిమా మొదలైంది. అమీన్ పూర్ పోలీసులు నిర్మాణం వద్దకు చేరుకుని పనులు ఆపాలని చెప్పడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగాడు. ఫోర్జరీ పత్రాలతో ప్లాట్ ని కొనుగోలు చేశావంటూ నోటీసు ఇవ్వడంతో కంగుతిన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కి కొందరు బ్రోకర్లు ఈ స్థలాన్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీకి చెందిన ఉన్నం అచ్చమ్మ అనే మహిళ బీరంగూడ మల్లిఖార్జున్ నగర్ లోని సర్వేనెంబర్ 967లో 800గజాల స్థలాన్ని 2006లో కొనుగోలు చేశారు. ఏప్రిల్ 6, 2012లో ఆమె మృతి చెందారు. అచ్చమ్మ పేరుమీద ఉన్న విలువైన స్థలాలను కాజేసేందుకు జీడిమెట్లకు చెందిన ఉన్నం శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి అవి దక్కించుకునేందుకు పథకం రచించాడు. ఇద్దరి ఇంటి పేర్లు ఒకే విదంగా ఉండటంతో తాను మృతురాలు అచ్చమ్మ కుమారుడినంటూ ఫోర్జరీ వారసత్వ పత్రాన్ని, ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి 2019లో ఆ ప్లాట్లను అమ్మాడు. దామోదర్ రెడ్డి ఆ ప్లాట్ ని అమ్మి పెట్టాలని బ్రోకర్లకు చెప్పడంతో వారు అమ్మకానికి పెట్టగా..శ్రీనివాస్ ఈ ప్లాట్లను కొనుగోలు చేశాడు.

కొన్ని రోజుల తర్వాత అచ్చమ్మ కుమారులు ఉన్నం వెంకటేశ్వర్లు, పార్థసారథిలకు విషయం తెలిసి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా అడ్డుకున్నారు. శ్రీనివాస్ తనకి ప్లాట్ అమ్మి, ఫోర్జరీకి పాల్పడిన వారిపై అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో 4 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. కేసు నమోదై నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ఈ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అచ్చమ్మ పేరుతో నకిలీ డెత్ సర్టిఫికెట్ ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ నుంచి పొందినట్లు తెలిసింది. జారీ అయిన డెత్ సర్టిఫికెట్ ఫేక్ అంటూ ఇస్నాపూర్ మునిసిపాలిటీ కమిషనర్ రాత పూర్వకంగా స్పష్టం చేశారు. దీంతో పాటు కోర్టు ద్వారా పొందిన వారసత్వ సర్టిఫికెట్ సైతం నకిలీదని తేలింది. కేటుగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు సైతం సృష్టించి సబ్ రిజిస్ట్రార్ ని బురిడీ కొట్టించారు. ఈ దొంగల ముఠా బారిన మరికొందరు పడ్డట్లు తెలుస్తోంది. ఇదే పద్ధతిలో ఇదే కాలనీలో 7,200 గజాల స్థలాన్ని కూడా కాజేసి కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు ఈ కేటుగాళ్ళకి సహకరించినట్టు స్థానికులు చెబుతున్నారు. భూములకు డిమాండ్ ఉన్న ఈ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో అన్ని డాక్యుమెంట్లు చూసుకుని కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us