
ఒరిస్సా రాష్ట్రం నుండి వైద్యం కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన మధుమిత అనే మహిళకు ఊహించని షాక్ తగిలింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కి వచ్చిన బాధిత మహిళ..డాక్టర్ సూచన మేరకు స్కానింగ్, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి స్కానింగ్ రూమ్ లోకి వెళ్లింది..అదే ఆమె పాలిట శాపంగా మారింది. అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆమె పాలిట దెయ్యంగా మారాడు. అతడు చేసిన పనికి షాక్ కి గురైన బాధితురాలు గట్టి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది..
మద్యం మత్తులో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ మహిళ ను అసభ్యంగా తాకుతూ తనను వేధించాడంటూ బాధితురాలు భయంతో బయటకు పరుగులు తీసింది.. జరిగిన ఘటనను ఆసుపత్రి నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయింది. పైగా వారంతా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బోరున విలపించింది. తన గోడును చెప్పుకునేందుకు బాధితురాలు భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జరిగిన ఘటనపై విచారించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భద్రాచలం పట్టణంలో ఎప్పడూ వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారిందంటూ స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులపట్ల అమానుషంగా ప్రవర్తించడం, వైద్యం సరిగ్గా చేయకపోవడం చివరి క్షణంలో ఖమ్మం, హైదరాబాద్ వంటి నగరాలకు రెఫర్ చేయడం, టైం బాగోలేక పేషెంట్ మృతి చెందితే ఆసుపత్రి ముందు ఆందోళన చేపడుతున్న వారిని బెదిరించడం ఇక్కడ సర్వసాధారణంగా మారిందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ ఆసుపత్రి లో తరచూ జరుగుతూనే ఉన్నా సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..