తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు చెక్ పెట్టేందుకు కేఆర్ఎంబీ ప్రయత్నం.. ఇవాళ పోతిరెడ్డిపాడును పరిశీలించనున్న సభ్యులు

|

Aug 11, 2021 | 8:43 AM

ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని ఇవాళ పరిశీలించనుంది KRMB బృందం.

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు చెక్ పెట్టేందుకు కేఆర్ఎంబీ ప్రయత్నం.. ఇవాళ పోతిరెడ్డిపాడును పరిశీలించనున్న సభ్యులు
Krmb Members Visit Pothireddypadu Project
Follow us on

Rayalasema Project: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని ఇవాళ పరిశీలించనుంది KRMB బృందం. ప్రాజెక్ట్‌ లిఫ్ట్‌ పనులను కూడా పరిశీలిస్తుంది. ఈ పర్యటన తర్వాత నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కి నివేదిక అందించనుంది KRMB బృందం. దీంతో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

కృష్ణా రివర్‌ బోర్డ్‌ బృందానికి లీడర్‌గా రాయ్‌పూరే వ్యవహరిస్తున్నారు. ఈ టీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎవరూ లేరు. రాయలసీమ ఎత్తపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతం పర్యటన విషయాన్ని కూడా చివరి వరకు రహస్యంగా ఉంచింది రివర్‌ బోర్డ్‌. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతం మొత్తం శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌తో నిండి ఉంది. చుట్టూ నీరు ఉంటుంది కాబట్టి అక్కడికి జనం ఎక్కువగా వస్తే కంట్రోల్‌ చేయడం కష్టం. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా కృష్ణారివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ప్రాజెక్ట్‌ పర్యటనకు రావడం చర్చనీయాంశంగా మారింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు శాపంగా మారిందని, ప్రాజెక్ట్‌ పనులను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. అయితే అక్కడ పనులు జరగడం లేదని ఏపీ వివరణ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంతో ఈనెల 5న ప్రాజెక్ట్‌ పరిశీలనకు రావాల్సి ఉంది KRMB. దీనిపై నివేదికను కూడా ఈనెల 9వ తేదీలోపే ఇవ్వాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల 5వ తేదీన పర్యటన వాయిదా పడగా, ఇవాళ పర్యటిస్తోంది KRMB టీమ్‌. దీంతో అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు.

కృష్ణా రివర్‌ బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు రావడాన్ని కొందరు రాయలసీమ నేతలు తప్పుపడుతున్నారు. బోర్డ్‌ సభ్యులు తమ ప్రాంతానికి రావాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి. రాయలసీమ పథకం కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను సందర్శించి రావాలని సూచించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్తది కాదని, తమ వాటా ప్రకారమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా.. తెలంగాణ మాత్రం దీన్ని తప్పుపడుతోంది. అది అక్రమ ప్రాజెక్టు అని ఆరోపిస్తోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా.. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఇదిలావుంటే, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు KRMB బృందం వెళుతోంది. దీంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు రివర్‌ బోర్డ్‌ ఇచ్చే నివేదికపై ఉత్కంఠ నెలకొంది.

Read Also.. IPL 2021: చెన్నై చేరిన సీఎస్‌కే లయన్.. ఐపీఎల్ సెకండాఫ్‌కి సిద్ధమంటూ సిగ్నల్.. యూఏఈ వెళ్లేది ఎప్పుడంటే..!