Krishna River Managment Board Meeting: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నీళ్లు ఇంకా నిప్పులు రాజేస్తూనే ఉన్నాయి. తెలంగాణపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులు చేస్తూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పరం కౌంటర్లు వేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు రేపు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కృష్ణాబోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంతో కేఆర్‌ఎంబీ భేటీ కీలకంగా మారింది.
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతిలేకుండా నిర్మిస్తోందని, శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో సాగునీరు సముద్రం పాలవుతున్నాయని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో జలవివాదంపై చర్చించేందుకు ఈనెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కృష్ణా బోర్డు భేటీ వాయిదా వేయాలని, 20 తర్వాత నిర్వహించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఈనేపథ్యంలో రేపు జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది.
ఇదిలావుంటే, తాజాగా తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లపై అభ్యంతరం చెబుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు లేఖ రాశారు. 8 ప్రాజెక్ట్‌ల ద్వారా 183 TMCలను తరలించేలా పనులు చేపడుతోందని, మరో 10 ప్రాజెక్ట్‌లను విభజన చట్టానికి విరుద్ధంగా చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్ భగీరథకు, కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC విస్తరణ ద్వారా 183 టీఎంసీలను తరలిస్తోందని వివరించారు.
ఇవి కాక మరో ఆరు ప్రాజెక్ట్‌లపై సర్వేకు అనుమతులు ఇచ్చారని లేఖలో రాసారు. ఇక, శ్రీశైలం పైభాగాన తుంగభద్ర, కృష్ణ కలిసే చోట 40 టీఎంసీలను వినియోగించుకునేలా జోగులాబం బ్యారేజ్ నిర్మించాలని ప్లాన్ చేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తెచ్చారు. రోజూ ఒక టీఎంసీని తరలించేలా బీమా కెనాల్‌ను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. వీటన్నింటికీ ఆపాలని, DPRలు సమర్పించేలా ఆదేశించాలి కోరారు.