Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి.. స్పీకర్ పోచారం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను అందించారు. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోచారానికి సమర్పించారు. కాగా.. లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించారు. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఉండటంతో వెంటనే పోచారం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం.. రాజగోపాల్ రెడ్డి గవర్నర్ తమిళి సైను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు. కాగా.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరునెలల్లో లేదా అంతకుముందే మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక.. బీజేపీకి, అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సవాల్ గా మారనుంది.
మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై ప్రకటించిన ధర్మయుద్ధం అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని.. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందంటూ పేర్కొన్నారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారంటూ పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలవాలని చూస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ఈనెల 4న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆగస్టు 5న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ తాను ఈనెల 21 బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు.
రాజీనామాకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.