Telangana Bonalu: ఆషాడ మాస బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా..? ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు పండగే..!

ఒకప్పుడు పల్లెగా వున్న హైదరాబాద్‌ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపు దిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు.

Telangana Bonalu: ఆషాడ మాస బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా..? ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు పండగే..!
Bonalu
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Jul 09, 2022 | 5:36 PM

Telangana Bonalu:  ఆషాఢమాసం వచ్చిందంటే చాలు. తెలంగాణ ప్రజల మోముల్లో అవ్యక్తమైన ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. భక్తి పారవశ్యమవుతుంది. స్త్రీ మూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటన కుంకుమ బొట్టవుతుంది. బోనం నెత్తిన కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇదో సంస్కృతిక సంబరం. ఛిద్రమైపోతూ విలపిస్తోన్న నగరానికి ఇదో ఆత్మీయ ఆలింగనం. అక్కున చేర్చుకునే ఊరడింపు. కాంక్రీటు జంగిల్‌గా మారిన నాగరిక నగరం తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోతుంది. మాసమంతా పల్లె పడుచు అందాన్ని సంతరించుకుంటుంది.. ఆనందంతో గంతులేస్తుంది.

ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే అమ్మలగన్నయమ్మకు బోనాలు సమర్పించడం. బోనం అంటే భోజనం. ఆ నైవేద్యాన్ని స్వీకరించిన అమ్మవారు ఆశీస్సులిస్తుంది. అనురాగం కురిపిస్తుంది. ప్రజలందరిని చల్లగా చూస్తుంది. బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా వుండాలని కోరుకునే నిస్వార్థపు పండుగదినం. అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన ఆనందపు వెల్లువలు. అంతకు మించిన జాతరలు. వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు. కులమతాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునేవే బోనాలు.

గోలకొండ కోటలో వెలిసిన జగదాంబకు బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి.ఆషాడ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయి. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో సంబరం మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ వారం సికింద్రాబాద్‌ అంతటా బోనాలు జరుపుకుంటారు. అటు పిమ్మట లాల్‌ దర్వజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవపు ఉత్సాహం కనిపిస్తుంది. నగరాల తర్వాత జిల్లాలలోనూ బోనాల పండుగ జరుపుకుంటారు. తెలంగాణ జాతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల సంప్రదాయం ఎప్పటిది? దాని వెనుక వున్న కారణమేమిటి?

ఇవి కూడా చదవండి

తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా, ఏ వేడుకలోనైనా పల్లె వాసన గుబాళిస్తుంది. పల్లెతనం అంతటా వ్యాపిస్తుంది. అణువణువునూ స్పృశించి ఆనందపరుస్తుంది. ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ పండగైనా పల్లెతో పంట పొలాలతో ప్రకృతితో మమేకమైనవే! రుతువులు మారిన కొద్ది వాతావరణం మారుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు సోకేది కూడా ఈ సీజన్‌లోనే! అవి దరిచేరకుండా వుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. చల్లగా చూమని బోనం సమర్పించుకుంటారు. అంతే కాదు ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేది కూడా ఇప్పుడే. వర్షాలు బాగా కురవాలనీ, పంటలు బాగా పండాలనీ ప్రకృతికి అధిదేవతైన అమ్మను వేడుకుంటారు. బోనం స్త్రీ శక్తికి ప్రతిరూపం. తెలంగాణ సంప్రదాయానికి చిహ్నం. బోనాన్ని మహిళలే తయారుచేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఎవరైతేనేమీ తెలంగాణకు వారంతా శక్తి స్వరూపమైన అమ్మవార్లే!

బోనం అంటే భోజనమే! భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో లేదా రాగి పాత్రలో వండుతారు. తర్వాత బోనాల కుండను వేప రెమ్మలతో, పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారు. ఆ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డబ్బు చప్పుళ్లతో ఆలయానికి తీసుకెళతారు. ఈ బోనాన్ని నైవేద్యంగా సమర్పించే ప్రక్రియను ఊరడి అంటారు. గ్రామాలలో దీనికే పెద్ద పండుగ, ఊర పండుగ అంటారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో బోనాల సంబరం ముగియదు. తర్వాత ఇంకా చాలా ఉంటుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి వెదురు కర్రలు, రంగుల కాగితాలతో చేసిన అలంకాలను సమర్పించుకుంటారు. రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారం కూడా బోనాల పండుగలో ఉంది.

ఆరువందల సంవత్సరాల కిందట పల్లవులు పాలించిన కాలంలోనే ఇక్కడ బోనాల పండుగ ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు ఏడుకోల్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారట! 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్‌ హుస్నాబాద్‌లో ఎల్లమ్మగుడిని కట్టించి, అమ్మవారికి బోనాలు సమర్పించారు. 1869లో జంటనగరాలను ప్లేగు పట్టి పీడించింది. ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ఆ పీడ నుంచి తమను దూరం చేయమంటూ గ్రామదేవతను ప్రజలు వేడుకున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం బోనం సమర్పించుకున్నారు. అంతకు ముందు అంటే కాకతీయుల ఆధీనంలో గోలకొండ వున్నప్పట్నుంచే బోనాల సంబరాలు జరుగుతున్నాయనేది చారిత్రక సత్యం. ఆ తర్వాత గోలకొండను జయించి అధికారాన్ని చేపట్టిన కులీకుతుబ్‌ షా బాదుషాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. నెల రోజుల పాటు అధికారికంగా అంగరంగ వైభవంగా బోనాలు జరిపించేవారు. తానీషా ఆస్థానంలో మంత్రులైన అక్కన్న-మాదన్నల ఆధ్వర్యంలో గోల్కోండ కోట నుంచి షాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు జరిగేవి…

అసప్‌జాహీలు కూడా బోనాలను నిర్వహించారు. 1908లో మూసీనది ఉప్పొంగింది. ఆ వరద ప్రవాహంలో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది… వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రధాని మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సూచన మేరకు నిజాం ప్రభువు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్ లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, చార్మినార్‌ దగ్గరకు చేరిన మూసీ నది నీటిలో సంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచే లాల్‌ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు.

ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలివెళ్తారు. భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్‌ పాతబస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. హైదరాబాద్‌ వాడల్లో వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్లన్నీ కొత్త హంగులు దిద్దుకుంటాయి. కొత్త రంగులు అద్దుకుంటాయి. కొత్త శోభను సంతరించుకుంటాయి. విద్యుద్దీపాలతో ధగధగమనిమెరుస్తాయి..

కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటారు. పట్టు వస్త్రాలు, పసుపుకుంకుమలను ఇచ్చి మొక్కకుంటారు.. ఆషాఢంలో అత్తా అల్లుళ్లు ఒకే గడప దాటకూడదనేది శాస్ర్తం. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే సంబరాలను తెచ్చే మాసం. అమ్మకు బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్లు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు. తొట్టెల తీసుకువెళతారు. అసలు ఈ సంబరాలను చూడ్డానికి రెండు కళ్లు చాలవు…

తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్టించి పోలేరమ్మగా, కట్టమైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర వుంది. ఒకప్పుడు పల్లెగా వున్న హైదరాబాద్‌ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపు దిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. హైదరాబాద్‌ అంటే ఇది! మూలల్ని మరవకపోవడమంటే ఇదే! హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. పచ్చదనాన్ని కోల్పోయాయి. చెరువులు దాంతో పాటే కట్టమైసమ్మలు అంతర్ధానమయ్యాయి. అనాదిగా వస్తూ వున్న కొన్ని పండుగలు ఉనికి కోల్పోయాయి. కొన్ని పండుగలు కొత్తగా వచ్చి చేరాయి. నగరాలు ఇంతగా మారినా భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?