ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేదే లేదంటోంది..తెలంగాణ ప్రభుత్వం. అటు విపక్ష బీజేపీ మాత్రం..ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామంటోంది. ఈ మేరకు ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తున్నారు..కమలం పార్టీ నేతలు. లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ చేపట్టింది..తెలంగాణ ప్రభుత్వం. ప్రాజెక్టులో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంత వాసుల నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. అయితే పేదల నివాసాల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..బీజేపీ. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాలకు చెందిన 8 జిల్లాల BJP అధ్యక్షులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఆర్ఆర్ఆర్‌పై నేతలతో చర్చించారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్న కిషన్‌రెడ్డి.. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని, బలవంతంగా వారిని తరలించడం సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ముందుగా కమర్షియల్ నిర్మాణాలను మాత్రమే కూల్చాలని ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వేలాది మంది పేదలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్ఠం చేశారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నామన్నారు. శుక్రవారం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు..కిషన్‌రెడ్డి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో తమ ఇళ్లు, దుకాణాలు కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్న బాధిత ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. నగరంలోని లంగర్‌హౌజ్, కార్వాన్ ఏరియాల్లో కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగుతుంది పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు హైడ్రాపై కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..తెలంగాణ బీజేపీ. ఈ మేరకు ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి లేఖరాసిన కిషన్‌రెడ్డి..నిర్మాణాలకు ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తె.. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలన్నారు. కూల్చివేతలకు ముందు బాధితులతో ప్రభుత్వం చర్చించాలని లేఖలో డిమాండ్ చేశారు కిషన్‌రెడ్డి.
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..