25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి.. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం

25 ఏళ్ల క్రితం సౌదీలో స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును మరచిపోని కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్.. పూర్తి చిరునామా కూడా లేకపోయినా గూగుల్ సాయంతో జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుని రూ.25 వేల అప్పును తీర్చాడు. అతడి నిజాయితీ, స్నేహానికి విలువ ఇచ్చిన తీరు స్థానికులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి.. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం
Mohammed Ismail

Edited By:

Updated on: Jul 10, 2026 | 10:17 AM

 

మాట ఇచ్చి నిలబెట్టుకోవడం, తీసుకున్న అప్పును మరచిపోకుండా తిరిగి చెల్లించడం నిజాయితీకి నిదర్శనం అంటారు. అలాంటి అరుదైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తీర్చేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా ధర్మపురికి వచ్చిన ఓ వ్యక్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్నతో కలిసి సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం ఇస్మాయిల్.. లచ్చన్న వద్ద నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా అప్పు చెల్లిస్తానని మాటిచ్చారు. అయితే అనివార్య కారణాలతో స్వదేశానికి వచ్చిన అనంతరం లచ్చన్నతో సంబంధాలు తెగిపోవడంతో ఆ అప్పు తీర్చే అవకాశం దొరకలేదు.

అయితే.. కాలం గడిచినా తీసుకున్న అప్పును మాత్రం ఇస్మాయిల్ మరచిపోలేదు. ఇటీవల ఎలాగైనా ఆ రుణం తీర్చాలని నిర్ణయించుకున్నారు. లచ్చన్న పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ ఏదీ లేకపోయినా.. ఆయన స్వస్థలం ధర్మపురి అనే ఒక్క సమాచారం ఆధారంగా గూగుల్‌లో వెతికి జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. స్థానికులను అడుగుతూ చివరకు గురువారం మధ్యాహ్నం లచ్చన్న ఇంటిని గుర్తించారు. ఆ సమయంలో లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం లచ్చన్నకు ఫోన్ చేయగా.. అప్పు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయిన లచ్చన్న.. పాత మిత్రుడి గొంతు వినగానే గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇస్మాయిల్ రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇన్నేళ్లుగా తన మనసులో ఉన్న రుణభారం ఇప్పుడు తీరిందని భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితుడు మాట నిలబెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పు తీర్చేందుకు ప్రత్యేకంగా రావడం చూసి లచ్చన్న కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

నేటి కాలంలో చిన్న మొత్తాల అప్పులనే తిరిగి చెల్లించకుండా తప్పించుకునే ఘటనలు పెరుగుతున్న వేళ.. 25 ఏళ్ల తర్వాత వేల కిలోమీటర్లు ప్రయాణించి అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ నిజాయితీ, కృతజ్ఞత, స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ధర్మపురిలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us