KCRకు బీఆర్‌ఎస్ ఒక కన్ను అయితే.. జాగృతి మరో కన్ను: ఎమ్మెల్సీ కవిత
కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభమైంది. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ జూన్ 4న దీక్ష ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, "జై తెలంగాణ" అనకపోవడాన్ని ఖండించారు. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ, బీసీ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తల నేపథ్యంలో శనివారం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించి పలు విషయాలపై మాట్లాడారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ.. జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ప్రకటించించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని అన్నారు. కనీసం ఇప్పటికైనా సీఎం జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదని విమర్శించారు. తెలంగాణ గ్రహచారం బాగలేక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త పథక రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమర వీరులు శ్రీకాంత చారి, యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావులలో ఎవరి పేరైన పెట్టాలని సూచించారు. “తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం స్పంచించడం?, ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం సీఎం ఎందుకు పనిచేస్తున్నారు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తొపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పింది. పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి నీళ్లను తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయి.
జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? రైతులను రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా? తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే.. యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు. కేసీఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దారుణం.” అని అన్నారు.
బీజేపీపై పోరాటం..
తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తోందని కవిత అన్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు, కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని బీజేపీని హెచ్చిరిస్తున్నాను అన్నారు. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుందని, మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తాం, మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తాం, జాగృతిలో మైనారిటీ హక్కల కోసం ముస్లీం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తాం, మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే మరో కన్ను జాగృతి, కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోబోం అని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
