తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ వేదికగా మిడ్ మానేరు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారాయన. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తీవ్ర ఆరోపణలను తన లేఖలో ప్రస్తావించారు.
తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం అన్నారు. దీని కంటే ముందు త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..