తెలంగాణలోని సైన్యాన్ని రాజకీయ కదనరంగంలోకి మళ్లిస్తున్నాడు, షర్మిల కొత్త పార్టీ వేళ, సేన విస్తరణకు సై అంటున్నాడు.. ఏమిటి అంతరార్థం.?

షర్మిల కొత్తపార్టీ పెట్టబోతున్నారు. పార్టీ విస్తరణకు పవన్‌ సయ్యంటున్నారు. ఓపెన్ చేస్తే, తెలంగాణలో నయా రాజకీయం మొదలుకాబోతోందా? భవిష్యత్‌..

  • Venkata Narayana
  • Publish Date - 5:45 pm, Sun, 28 February 21
తెలంగాణలోని సైన్యాన్ని రాజకీయ కదనరంగంలోకి మళ్లిస్తున్నాడు, షర్మిల కొత్త పార్టీ వేళ, సేన విస్తరణకు సై అంటున్నాడు.. ఏమిటి అంతరార్థం.?

షర్మిల కొత్తపార్టీ పెట్టబోతున్నారు. పార్టీ విస్తరణకు పవన్‌ సయ్యంటున్నారు. ఓపెన్ చేస్తే, తెలంగాణలో నయా రాజకీయం మొదలుకాబోతోందా? భవిష్యత్‌ రాజకీయాల్లో ఏ జెండాది.. ఏ ఎజెండా?, అసలు షర్మిల అరంగేట్రమే పవన్ పార్టీ తెలంగాణ విస్తరణకు కారణమా అనే అనుమానాలూ పొలిటికల్ సర్కిల్స్ లో షురూ అయ్యాయి. ఇప్పటిదాకా ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన తెలంగాణలో కాలుమోపబోతోంది. హైదరాబాద్‌లో సమావేశాలు, భేటీలతోనే సరిపెడుతూ వచ్చిన జనసేనాని…తెలంగాణలో తన సైన్యాన్ని రాజకీయ కదనరంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వీర మహిళల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ మనసులోని మాట భవిష్యత్‌ రాజకీయాలకు సంకేతంలా కనిపిస్తోంది. తెలంగాణని పోరుగడ్డన్న పవన్‌కళ్యాణ్‌…రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్లేనా? పార్టీ ఆవిర్భావ దినోత్సవమే తెలంగాణలో విస్తరణకు ముహూర్తమా? అనే ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది.

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా. బుల్లెట్‌దిగిందా లేదా? సినిమాల్లో ప్రిన్స్‌ డైలాగయినా..పొలిటికల్‌ లైఫ్‌లో పవర్‌స్టార్‌ ఇదే ట్రెండ్‌ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఓ లెక్క…ఇకనుంచో లెక్కంటున్నారు పవన్‌కళ్యాణ్‌. వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ సన్నాహాలతో…తెలంగాణలో తను కూడా సై అంటోంది జనసేన. హైదరాబాద్‌లో జరిగిన జనసేన వీరమహిళ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్‌. జనసేన పురుడుపోసుకుంది హైదరాబాద్‌ గడ్డపైనేనని గుర్తుచేశారు. త్వరలోనే పవన్‌కళ్యాణ్‌ చెప్పిన వెయిటింగ్‌ పీరియడ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడబోయే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు పవన్‌. ఈ గడ్డమీద తనకెంతో మమకారం ఉందన్నారు చెప్పుకున్నారు‌. తెలంగాణ ఆకాంక్షలను గౌరవించేందుకే ఇన్నాళ్లూ ఇక్కడ పార్టీ విస్తరణపై దృష్టిపెట్టలేదన్నారు. తెలంగాణ నలమూలలా తిరిగానని.. ప్రతీ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందన్న పవన్‌కల్యాణ్‌.. త్వరలోనే తెలంగాణలో పార్టీ విస్తరణ ఉంటుందనే సంకేతాలిచ్చారు.

ఈ గాలీ ఈ నేల అంటూ..తెలంగాణ గడ్డతో తనకున్న అనుబంధాన్ని వీరమహిళలతో భావోద్వేగంతో పంచుకున్నారు పవన్ కళ్యాణ్. తనకు జన్మనిచ్చింది ఆంధ్ర అయితే పునర్జన్మనిచ్చింది తెలంగాణేనన్నారు. తెలంగాణలో తనకున్న బలమేంటో తనకు తెలుసన్నారు జనసేనాని. 2014లో అప్పటి పరిస్థితులకు తగ్గట్లు కావాలనే తానే ఓ అడుగువెనకేశానన్నారు. తెలంగాణలో తన ఆలోచనకు అంకురార్పణ జరిగిన సందర్భాన్ని గుర్తుచేశారు పవన్‌. నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితులకు సాయం చేయాలనే సంకల్పానికి రాజకీయం అడ్డుపడిందన్నారు. పదవులకోసం బాధ్యతగల రాజకీయంకోసమే అడుగు ముందుకేశానన్నారు. తొలి ఎంపీటీసీ గెలిచింది తెలంగాణలోనే అని గుర్తు చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన పోరాడి గెలిచింది. రాజకీయమనేది రెడీమేడ్‌ కాదు..సంఘర్షణతోనే ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు పవన్‌. అంటే..తెలంగాణలోనూ సవాళ్లకు పవన్‌ సిద్ధమైనట్లేనా? ఆయన మాటల్లోని అంతరార్థం అదేనా.

జనసేనది పాతికేళ్ల ప్రస్థాన వ్యూహమన్నారు పవన్‌. పార్టీ నిర్మాణం అంత తేలికకాదన్నారు. నిస్సంకోచంగా మాట్లాడగలిగే సామాన్య మధ్య తరగతి ప్రజలే తనకు అండాదండా అన్నారు జనసేనాని. వాళ్లే తన వెంట బలంగా నిలబడతారన్న నమ్మకంతో ఉన్నారు. కొత్త పార్టీ ప్రయత్నాల్లో ఉన్న వైఎస్‌ షర్మిల తాను పుట్టి పెరిగింది తెలంగాణలోనేనన్నారు. తనకీ గడ్డతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకున్నారు. పవన్‌కల్యాణ్‌ కూడా తెలంగాణతో తన అనుబంధాన్ని, ఈ గడ్డపై తనకున్న మమకారాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఓ పక్క లోటస్‌పాండ్‌లో ఆత్మీయసమ్మేళనాలతో భవిష్యత్‌ రాజకీయానికి షర్మిల రూట్‌మ్యాప్‌ రెడీ చేసుకుంటుంటే…ఏపీ పంచాయతీ ఎన్నికల ఊపుతో… తెలంగాణలోనూ నేను రెడీ అంటున్నారు పవన్‌కల్యాణ్‌. వీరమహిళల సమావేశంతో ఆ దిశగా ఆయనో అడుగు ముందుకేసినట్లే కనిపిస్తోంది.

ఇక, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురిగా రాజకీయ భవిష్యత్‌పై ఆశలుపెట్టుకున్నారు వైఎస్‌ షర్మిల. అన్న వైఎస్ జగన్‌ వ్యతిరేకించినా..తెలంగాణలో కొత్త పార్టీకి సిద్ధమయ్యారు. రక్తసంబంధాలకు, రాజకీయ నిర్ణయాలకు సంబంధం లేదనే సంకేతాలిస్తూ…పార్టీకి మద్దతు కూడగట్టుకునే పన్లో ఉన్నారు. వైఎస్ షర్మిల నిర్ణయం ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఉంది. ఆంధ్ర నేతలకు ఇక్కడి రాజకీయం ఎందుకన్న వాదన కూడా మొదలైంది. తాను తెలంగాణ కోడలినని, ఎప్పుడో తెలంగాణకు జైకొట్టానని షర్మిల చెప్పుకున్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లు గడవటంతో పొలిటికల్‌ ఎంట్రీకి ఇదే తగిన టైమనుకున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలుచుకుంది జనసేన. గెలిచిన ఎమ్మెల్యే కూడా ఫిరాయించటంతో డీలాపడుతుందనుకున్న పార్టీకి..పంచాయతీకి ఎన్నికలు ఊపిరిపోశాయి. కొత్త ఆశలు నింపాయి. దీంతో అక్కడ మున్సిపల్‌ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న జనసేన…తెలంగాణలో విస్తరించేందుకు ఇదే తగిన టైమనుకుంటోంది. అప్పట్లో తెలంగాణ ఆకాంక్షలను గౌరవించి వెనక్కితగ్గానంటున్న పవన్‌కల్యాణ్‌…ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కూడా తమ పార్టీకి గట్టి సపోర్ఠ్‌ దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నారు. కాకపోతే షర్మిల పార్టీ ప్రకటనకు ముందే జనసేన ఎంటరవుతుందా? లేదంటే..జనసేనాని ఇంకాస్త టైం తీసుకుని ఆచితూచి అడుగేస్తారో చూడాలి. ఇదిలాఉంటే, తెలంగాణ కొత్త రాజకీయాలకు చోటులేదన్నారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌. షర్మిల కొత్తపార్టీ, జనసేన విస్తరణ ఆలోచనలపై గంగుల రియాక్ట్‌ అయ్యారు. షర్మిల ఏపీలో రాజకీయాలు చేసుకోవాలన్నారు గంగుల. అంతేనా, ఇక్కడ సొమ్ములున్నాయి కాబట్టి ఇటువైపు వస్తున్నారంటూ హాట్ కామెంట్ చేయడం టీఆర్ఎస్ షురూ చేసినట్టైంది.

Read also : డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ