
వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. సమాజంలో మారుతున్న అభిరుచులకు తగ్గట్టుగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. వేగంగా ప్రయాణించడంతో పాటు, త్వరగా గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎంతగానే దోహదపడుతుంది. అయితే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించిన తొలిరోజు నుంచే అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రాళ్లతో దాడులు చేశారు. కొన్ని చోట్ల రైలు అద్దాలు విరిగిపోయేలా హేయమైన చర్యలకు పాల్పడ్డారు. అయితే వారిలో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా మరికొందరి ఆచూకి లభించలేదు. అయితే తాజాగా ఇలాండి రాళ్ల దాడి ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గులేరులోని రాయితో పిట్టను కొట్టబోతే అది పొరపాటున వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాకింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటాడు. అందులో భాగంగా డిసెంబర్ 30 శనివారం రోజున పిట్టలు కొట్టడానికి ప్రయత్నించగా అది తృటితప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న 20833 నంబరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తగలింది. ఈ ఘటనలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అద్దం పగలడంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో వందే భారత్ రైలు అద్దం పగలడానికి కారణం హరిబాబు అని తేల్చారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే క్రమంలో కావాలని రైలుపై దాడి చేయలేదని.. పిట్టలను కొట్టబోతే అది రైలు అద్దానికి పొరపాటున తగిలిందని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ అతని వాదనలతో ఏకీభవించని పోలీసులు పిట్టలను వేటాడే గులేరును సీజ్ చేసి ఆయనను అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..