Telangana: రైతన్నలకు మధ్యాహ్న భోజనం.. ప్రతీరోజూ రూ. 10కే కడుపునిండా

రైతుల ఆకలిని తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ ముందుకు వచ్చింది. ఆదిలాబాద్‌లో ఇది జరుగుతుండగా.. కేవలం రూ. 10 కే రైతులకు భోజనం పెడుతోంది ఇస్కాన్ సంస్థ. మరి ఆ వివరాలు ఏంటో..? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Telangana: రైతన్నలకు మధ్యాహ్న భోజనం.. ప్రతీరోజూ రూ. 10కే కడుపునిండా
Farmers Good News

Edited By:

Updated on: Nov 20, 2025 | 8:22 PM

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలి తీర్చే భాగ్యం కలిగితే. ఆరుగాలం కష్టించి పంటను అమ్ము కునేందుకు మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతుకు బుక్కెడు బువ్వపెట్టే అదృష్టం దక్కితే. అలాంటి కార్యక్రమాన్నే ప్రారంభించింది ఇస్కాన్. పంటను అమ్ముకునేందుకు అరిగోసలు పడుతూ మార్కెట్ యార్డ్ కు వచ్చే అన్నదాతలు అర్థాకలితో ఉండకూడదన్న ఆలోచనతో తమ వంతు సహకారంగా ముందుకు వచ్చింది ఇస్కాన్‌ సంస్థ. కేవలం పది రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టి అన్నదాత రుణాన్ని తీర్చుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ సహకారంతో ఈనెల 13న ఘనంగా ప్రారంభించింది ఇస్కాన్. పప్పు, సాంబార్ భోజనాన్ని అందిస్తోంది‌. ఈ భోజనానికి అయ్యే ఖర్చులో రూ.10 మాత్రమే రైతుల నుండి వసూలు చేసి, మిగతా మొత్తాన్ని మార్కెటింగ్ శాఖ , ఇస్కాన్ లు భరించేలా ఏర్పాటు చేసింది. రోజుకు వేయి మందికి తగ్గకుండా భోజనాన్ని అందిస్తోంది‌. ఈ కార్యక్రమం అన్నదాతకు ఎంతో మేలు చేకూర్చే గొప్ప నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు మార్కెట్ యార్డ్ కు వస్తున్న రైతులు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళ్లే రైతన్నకు అడుగడుగునా కష్టాలే. పంట అమ్ముడు పోతుందో లేదో అదికారులు ఏం కొర్రీలు పెడ్తారు.. కొన్నాక పైసలు అకౌంట్ లో పడుతాయో లేదో.. ఒకటా రెండా అనేక ఆలోచనలు. ఈ ఆలోచనల్లో పడి తన ఆకలినే మర్చిపోతాడు రైతన్న. కడుపు మండుతున్నా.. వంద రూపాయలు పెట్టి భోజనం చేసేందుకు ఒకటి పది సార్లు ఆలోచిస్తాడు. దారి ఖర్చు లకు ఆ వంద అయినా ఆసరా అవుతుందేమో అన్న ధైర్యంతో. అలాంటి రైతుకు ఉడతా సాయం దొరికితే.. వంద రూపాయల భోజనం పది రూపాయలకే ఇవ్వగలిగితే అదే పది వేలు అంటోంది ఆదిలాబాద్ ఇస్కాన్ సంస్థ. ఉచితంగా కాకపోయినా ఏదో తమ వంతుగా అర్థాకలితో అన్నదాత ఉండకూడదన్న నిర్ణయంతో పది రూపాయలకే కడుపు నిండా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది‌.

ఈనెల 13న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇస్కాన్. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ , మార్కెట్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అందించే ఈ ఒక్క పూట భోజనానికి 35 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ మొత్తంలో రైతు వద్ద నుంచి కేవలం రూ.10 మాత్రమే వసూలు చేస్తుండగా… మిగతా 25 రూపాయాల్లో మార్కెటింగ్ శాఖ రూ.15, ఇస్కాన్ రూ.10 భరించనుంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం సద్దిమూట అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం రూ.5కే అన్నదాతలకు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సాయంతో నడిచే ఆ కార్యక్రమం లో 500 మంది రైతులకు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. తాజాగా ఇస్కాన్ సహాకారంతో అందిస్తున్న భోజనానికి మాత్రం పది రూపాయలు వసూలు చేస్తున్నారు. పెరిగిన ఖర్చులు రుచికరమైన‌ భోజనం అందించేందుకు తప్పని పరిస్థితుల్లోనే పది రూపాయలుగా నిర్ణయం తీసుకున్నామని చెపుతున్నారు ఇస్కాన్ నిర్వహకులు.

Follow Us