Telangana: మెడికో ప్రీతి మృతిపై హైకోర్టులో విచారణ.. తెలంగాణ సీఎస్‌తోపాటు పలువురికి నోటీసులు..

|

Apr 26, 2023 | 6:10 AM

Medical Student Preeti: మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ సీఎస్‌తోపాటు.. పలువురికి నోటీసులు జారీ చేసింది.

Telangana: మెడికో ప్రీతి మృతిపై హైకోర్టులో విచారణ.. తెలంగాణ సీఎస్‌తోపాటు పలువురికి నోటీసులు..
Telangana High Court
Follow us on

Medical Student Preeti: వరంగల్‌ మెడికో ప్రీతి మృతి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ప్రీతి మరణంపై హత్య కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించాలని మల్లయ్య లేఖలో కోరారు. ఆయన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారణ చేపట్టింది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

తెలంగాణ సీఎస్‌తోపాటు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, వరంగల్ సీపీ, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అనస్థీషియా విభాగం అధిపతికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి.. వరంగల్ సీపీ రంగనాథ్ ప్రీతిది ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు. ప్రీతి ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందన్నారు. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫే అని.. అతని వేధింపుల వల్లే ఘటన జరిగిందని తేల్చారు. వేధింపులు తట్టుకోలేక ప్రీతి పాయిజన్ తీసుకుందన్నారు.

ప్రీతి కుటుంబ సభ్యులు సైతం ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని చెప్పారు. అయితే.. ప్రీతిది సూసైడేనా?.. అని తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ప్రీతి మృతిపై హత్య, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం అభియోగాలపై కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించాలని కోరారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. సకాలంలో ఛార్జిషీటు వేసి నిందితులకు మరణశిక్ష పడేలా చూడాలన్నారు. ప్రీతి కుటుంబానికి 10 కోట్ల పరిహారం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని లేఖలో కోరారు. మల్లయ్య పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. పలువురికి కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..