ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంను కలుస్తానన్నారు రేవంత్ రెడ్డి. మే 22 బుధవారం తిరుమల శ్రీవారిని రేవంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి.. కరువు పరిస్థితులు తొలగిపోవాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమలలో ప్రభుత్వం తరపున సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన తిరుమల దర్శనానికి రావడం ఇదే తొలిసారి. తన కుటుంబం కలిసి సీఎం రేవంత్ మొక్కు తీర్చుకున్నారు. కొండపై మనవడి పుట్టు వెంట్రుకలు తీశారు. రేవంత్ రెడ్డికి శ్రీవారి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.
ఇక తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు, నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి, రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..