వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన కాంగ్రెస్, ఎంఐఎం..!
భారతదేశంలో కొత్త వక్ఫ్ చట్టం విస్తృత నిరసనలకు దారితీసింది. తెలంగాణతో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, AIMIM పార్టీలు ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. అమిత్ షా ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

వక్ఫ్ కొత్త చట్టం దేశమంతటా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సైతం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ముస్లిం నేతలు ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ముస్లిం లాబోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే.. దేశంలోని కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ బిల్లు ఆవశ్యకతపై స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.
ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా చెప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డు పేరుతో దేశంలో భారీ దోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని అరికట్టేందుకే సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు-2025పై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సైతం ఒవైసీ సుప్రీంలో సవాల్ చేశారు. బిల్లులో అంశాలు ముస్లింల సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఓవైసీ తనదైన శైలిలో మండిపడ్డారు.
హైదరాబాద్-పాతబస్తీ మక్కా మసీదు ప్రాంతంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది యువకుల నిరసన చేపట్టారు. వక్ఫ్ బిల్లును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 23న చలో హైదరాబాద్‌కు ముస్లిం మతపెద్దల పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లుపై తర్వాతి పరిణామాలు ఎలాంటి మరిన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.