America: అమెరికాలో అఖిల్ సాయి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది స్నేహితుడే..!

అమెరికాలో మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి అఖిల్‌ సాయి మృతి ఘటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గన్‌ మిస్‌ ఫైర్‌ అవ్వలేదు. కావాలనే గన్‌తో కాల్చారని అలబామా పోలీసులు చెబుతున్నారు.

America: అమెరికాలో అఖిల్ సాయి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది స్నేహితుడే..!
Us Gun Culture

Updated on: Feb 09, 2023 | 6:02 AM

అమెరికాలో మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి అఖిల్‌ సాయి మృతి ఘటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గన్‌ మిస్‌ ఫైర్‌ అవ్వలేదు. కావాలనే గన్‌తో కాల్చారని అలబామా పోలీసులు చెబుతున్నారు. కాల్చింది ఎవరో కాదు.. అఖిల్‌ ఫ్రెండ్ రవితేజనే అని కూడా విచారణలో తేలిందట. ఇంతకీ రవితేజ ఎందుకు అఖిల్‌ను చంపాడు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విద్యార్థి అఖిల్‌ సాయి అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చేస్తూ.. అక్కడే ఒక గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డు దగ్గరున్న గన్‌ పేలి.. అఖిల్‌ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తలకు బుల్లెట్‌ గాయాలతో ఆస్పత్రికి తరలించేలోపే అఖిల్‌ సాయి మృతి చెందాడు. ఇదీ ఫస్ట్‌ రిపోర్ట్‌..

ఎంక్వైరీ రిపోర్ట్‌తో మారిన సీన్..

ఆ తర్వాత వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్‌తో సీన్‌ మారింది. అఖిల్ సాయి చనిపోయింది మిస్‌ ఫైర్‌లో కాదని.. తోటి విద్యార్థే తుపాకీతో కాల్చి చంపాడని తేల్చారు అలబామా పోలీసులు. అఖిల్‌ సాయి రూమ్‌మేట్‌ రవితేజ గోలిని అరెస్ట్‌ చేసి.. మోంటెగోమరి జైలుకు తరలించారు. మొదట తుపాకీ మిస్‌ ఫైర్‌ అయిందంటూ రవితేజ పోలీసులకు చెప్పాడు. విచారణలో నిజాలు కక్కాడు.

ఇవి కూడా చదవండి

అఖిల్‌ అమెరికా వెళ్లి ఏడాదిపైనే..

అఖిల్‌ సాయి అలబామా యూనివర్సిటీ లో ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లి ఏడాది దాటింది. అతడి తల్లిదండ్రులు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. అమెరికాలో చదువుకోవడానికి ఎంతో ఆనందంగా వెళ్లిన అఖిల్‌ ఇప్పుడు విగతజీవిగా రానుండడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డ మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక అఖిల్‌ సాయిని రవితేజ ఎందుకు చంపాడు? అసలు ఆ రివాల్వర్‌ ఎక్కడినుంచి వచ్చింది? వ్యక్తిగత కారణాలతోనే చంపాడా? ఇంకేదైనా రీజన్ ఉందా అన్న కోణాల్లో అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గ్యాస్‌ స్టేషన్‌లో ఘటన..

అమెరికాలోని అలబామాలో ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తూర్పు BLVD 3200 బ్లాక్‌కి చెందిన ఓ గ్యాస్‌ స్టేషన్‌లో అఖిల్‌ పనిచేస్తున్న టైమ్‌లోనే ఈ ఘటన జరిగింది. అఖిల్‌ పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ లో రవితేజ కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల అమెరికా వ్యాప్తంగా చాలా చోట్ల గ్యాస్ స్టేషన్ లలో క్రైమ్ పెరిగిపోవడంతో.. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్యాస్ స్టేషన్ లో పని చేసే ఉద్యోగులకు గన్ ఇస్తున్నారు. వీళ్లిద్దరూ పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ యాజమాన్యం కూడా వీళ్లకు ఓ గన్ ఇచ్చింది. అత్యవసర సమయంలో గన్ ఎలా కాల్చాలి అన్న దానిపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. దీని కోసం గన్ లో ఉన్న బుల్లెట్లు అన్నీ తొలగించి అఖిల్ సాయి, రవితేజలకు ఇచ్చింది. కొంత సేపు గన్ ఎలా కాల్చాలి అన్నదానిపై శిక్షణ తీసుకున్న వీరిద్దరు.. ఆ తర్వాత బుల్లెట్లు లోడ్ చేయడం కూడా నేర్చుకున్నారు. తర్వాత బుల్లెట్లు తీసివేసి మరోసారి గురిపెట్టడం చేశారు. అయితే ఓ బుల్లెట్ పొరపాటున అందులోనే ఉండిపోయిందని, ఆ విషయం తెలియక రవితేజ ట్రిగ్గర్ నొక్కడంతో అఖిల్ సాయి మరణించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. తరువాతి విచారణలో అసలు నిజం బయటపడింది.

అఖిల్‌, రవితేజ మధ్య గొడవల్లేవన్న ఫ్రెండ్స్..

అయితే, గ్యాస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న అఖిల్ సాయి, రవితేజ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలను లేవని అలబామాలో ఉండే ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. ఒక పొరపాటు వల్ల నిండు ప్రాణం పోయిందని స్నేహితులు చెప్పుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ.. వాస్తవం ఏంటన్నది చెప్పలేమని అలబామా పోలీసులు అంటున్నారు. మరోవైపు అఖిల్‌ సాయి తల్లిదండ్రులు పుత్రశోకంతో నరకయాతన పడుతున్నారు.

మిస్టరీగా మారుతున్న మరణాలు..

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న తెలుగు విద్యార్థుల్లో కొందరు నెత్తుటి మడుగులో కుప్పకూలిపోతున్నారు. సుదూర తీరాలకు వెళ్లినవాళ్లు తిరిగిరాని లోకాలకు తరలిపోతున్నారు. వాటిలో కొన్ని మరణాలు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. మొన్నీమధ్యే.. చికాగోలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువకముందే.. అమెరికాలో ఖమ్మం జిల్లావాసి విద్యార్థి అఖిల్ సాయి మృతి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. అయితే.. ఈ కాల్పుల కేసులో నయా ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఇది ఏ తీరం చేరుతుందో.. ఏమో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..