తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి సన్ని్ధిలో మూఢ విశ్వాసాలు పేట్రేగిపోతున్నాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇనుమ గొలుసులతో బంధిస్తే నయమవుతుందన్న అంధ విశ్వాసాలకు అమాయకులు బలైపోతున్నారు. 20 నుంచి 40 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో గానీ, చుట్టుపక్కల గానీ రోగులను గొలుసులతో కడితే వారి ఆరోగ్యం మెరుగవుతుందనే నమ్మకంతో సొంత కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడుతున్నారు. దీనివల్ల చాలా మంది వ్యక్తులు బాధితులుగా మారిపోతున్నారు. మానసికంగా, శారీరకంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో యాచకులుగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో సంరక్షణ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దవాళ్లనే కాకుండా చిన్న పిల్లలను సైతం ఇలా బంధించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా రాజూర గ్రామం నుంచి నవీన్ అనే యువకుడిని కొండగట్టు ఆలయానికి తీసుకొచ్చారు. నవీన్ బంధువులు అతడి కాళ్లను ఇనుప గొలుసులతో కట్టేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు, అధికారులు స్పందించారు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ తరఫున వారికి అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. బంధువులు ఎవరూ లేకపోవడంతో వారిని అనాథలుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.
గుడి ముందు గానీ, చెట్టుకు గానీ మానసిక రోగులను కట్టివేయడాన్ని గమనించామని, వారిని విడిపించి మానసిక ఆరోగ్య కేంద్రాలను తరలించినట్లు జిల్లా కలెక్టర్ సుమితా దావ్రా పేర్కొన్నారు.
ఇన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రజల్లో మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, వారిలో ఎలాంటి మార్పులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అంజన్న, శ్రీరామ్ నామ జపంతో మారుమోగాల్సిన కొండగట్టుపై అమాయకుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి