Hyderabad: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఉగాది వేళ దళితుడి పేరుతో గుడికి తాళం..

|

Mar 22, 2023 | 8:53 PM

వికారాబాద్‌ జిల్లాలో ఓ అగ్రకుల సర్పంచ్‌ కులదురహంకార చర్య కలకలం రేపుతోంది. ఉగాది పర్వదినం రోజు దళితుల మైల దేవుడికి అంటకూడదంటూ దేవాలయానికే తాళాలు వేసిన కులపైత్యపు ఘటన ఆందోళన రేపుతోంది.

Hyderabad: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఉగాది వేళ దళితుడి పేరుతో గుడికి తాళం..
Temple Lock
Follow us on

వికారాబాద్‌ జిల్లాలో ఓ అగ్రకుల సర్పంచ్‌ కులదురహంకార చర్య కలకలం రేపుతోంది. ఉగాది పర్వదినం రోజు దళితుల మైల దేవుడికి అంటకూడదంటూ దేవాలయానికే తాళాలు వేసిన కులపైత్యపు ఘటన ఆందోళన రేపుతోంది. ఎప్పుడో అంబేడ్కర్‌ కాలంలో కాదు.. అభివృద్ధి ఆకాశపుటంచులు తాకుతోందని భావిస్తోన్న ఈ రోజుల్లో దళితులను గుడి బహష్కరణ చేసి తనలోని కుల పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు ఓ సర్పంచ్‌.

ఉగాది తెలుగు సంవత్సరాది.. ఇంటింటా ఆనందాల హేళి.. అయితే, ఓ అగ్రవర్ణ సర్పంచ్‌ చేసిన కులదురహంకార చర్య, అవమాన భారంతో దళితుల గుండెలు మండేలా చేసింది. ఇదే ఉగాది పర్వదినాన.. దళితులు గుళ్ళోకి వస్తున్నారని గ్రామ దేవతల గుళ్లకు తాళాలు వేయించాడు వికారాబాద్‌ జిల్లాలోని కేరెళ్ళి గ్రామ సర్పంచ్‌ నర్సింహారెడ్డి.

దళితులను దేవాలయాల్లోకి ప్రవేశించనివ్వొద్దనే ఓ దుర్మార్గమైన సిగ్గుమాలిన చర్య జరిగింది ఎక్కడో కాదు.. ఎస్సీ నియోజకవర్గమైన వికారాబాద్ నియోజకవర్గంలో, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ సొంత గ్రామం ధారూర్ మండలం కేరెళ్లిలో జరిగిన ఈ ఘటన యావత్‌ సమాజాన్ని నివ్వెరపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉగాది పర్వదినం రోజున అందరిలాగే తామూ గుళ్ళో దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన దళితులకు మూసివున్న తలుపులకు వేళ్ళాడుతున్న తాళాలు కనిపించాయి. ఎస్సీలను గుళ్లలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్పంచ్ నర్సింహారెడ్డి తాళం వేయించాడని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన దేవాలయాలకు తాళాలు ఉండడంతో గుడి ముందు ఉండే చిన్న ప్రతిమలకు పూజలు చేసుకొన్నారు గ్రామ దళితులు. ఈ దయనీయమైన ఘటన, అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గుళ్లకు వేసిన తాళాలు తీయాలని గ్రామ యువకులు వాట్సాప్‌ గ్రూపుల్లో కోరినా ఫలితం లేకుండాపోయింది. గుళ్లకు కాపలాగా నీవుంటావా.. నీ బాబు ఉంటాడా అంటూ సర్పంచ్ అహంకార పూరిత సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అంతటితో ఆగకుండా.. గుడి తలుపులు తెరవమని కోరిన వారికి.. ఎస్సీలు గుడిముందు ఉండే చిన్న ప్రతిమలకు పూజలు చేసుకోవాలని వాట్సాప్ గ్రూపుల్లో సర్పంచ్ ఉచిత సలహా ఒకటి పారేశాడు. అంతేకాదు.. దేవాలయ తాళాలు తీయాలని ప్రశ్నించిన యువకులను గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో నుంచి తొలగించి తన ప్రతాపం చూపించాడు సర్పంచ్ నర్సింహారెడ్డి. కుల దురహంకారంతో వ్యవహారిస్తున్న సర్పంచ్ ను బర్తరఫ్ చేయాలని కలెక్టర్ కు గ్రామ దళిత సంఘాల విజ్ఞప్తి చేశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..