Telangana: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిళ్లో సంతోషంగా జరగాల్సిన పెళ్లి.. తీవ్ర విషాదంతో బ్రేక్ పడింది. బతుకుదెరువుకోసం కువైట్ వెళ్లిన తండ్రి.. అకస్మాత్తుగా అక్కడే చనిపోవడంతో అతని కూతురు పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బిర్నంది గ్రామానికి చెందిన శాతం లచ్చన్న బ్రతుకుదేరువు కొరకు గత 12 సంవత్సరాల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి ఇప్పటికే చేయగా.. ఇవాళ రెండవ కూతురు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆకుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కువైట్ నుంచి వచ్చిన ఫోన్ వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. కువైట్‌లో నిన్న రాత్రి లచ్చన్న ఆవలిస్తూ.. గుండెపోటుకు గురయ్యాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతని సహచరులు లచ్చన్న ఇంటికి ఫోన్ చేసి.. సమాచారం అందించారు. లచ్చన్న ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. లచ్చన్న మృతితో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు ఆగిపోయాయి. బాధిత కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.