జగిత్యాల నుండి నలుగురు యువకులు లోకల్ ఏజెంట్‌కు రెండు లక్షల రూపాయలు చెల్లించి లావుస్ దేశానికి వెళ్లారు. అక్కడ డేటా ఎంట్రీ జాబ్ అంటూ నమ్మించి యువకులను మోసం చేశారు. ఆ దేశంలో దిగిన వెంటనే వారికి ఒక చిన్నపాటి రూమ్ కేటాయించి సైబర్ నేరాలకు పాల్పడేలా రెండు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే బలవంతంగా ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఎన్నారైలను ట్రాప్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఒకవేళ వారు ఇచ్చిన పని చేయకుంటే యువకులను హింసించేవారు. రోజుకు 18 గంటల చొప్పున యువకులతో పని చేయించుకుని నానారకాల ఇబ్బందులు పెట్టేవారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చైనీస్‌కు చెందిన పలువురు చేస్తున్నట్లు యువకులు తెలిపారు
జగిత్యాల నుండి సెప్టెంబర్ 30న నలుగురు యువకులు ప్రవీణ్, మహేష్, అఖిల్, మోహన్ కలిసి ఏజెంట్‌కు డబ్బులు చెల్లించి పాస్‌పోర్ట్ ఇచ్చాక లావుస్ దేశానికి వెళ్లారు. ఆక్కడ జరుగుతున్న అఘాయిత్యాలను చూసి తిరిగి వచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.ఎట్టకేలకు తెలంగాణకు యువకులు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు యువకులు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో గతంలోనూ పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ నిరుద్యోగులకు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లావుస్, కంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి ఎవరైనా ట్రాప్ చేస్తే వారి వివరాలు తమకు ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు