తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. మే 26 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. మే 24న కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షం కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్‌లో శనివారం వర్షం పడే అవకాశం ఉంది. ఆదివారం సంగారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
రానున్న రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల కనిపించదని వివరించింది. ఇదిలావుండగా, జూన్ 6 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి