Telangana: గ్రేటర్ హైదరాబాద్‎కు పోటీగా మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు.. హైడ్రా ప్రణాళికలు ఇవేనా..

| Edited By: Srikar T

Jul 16, 2024 | 9:08 PM

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వాహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న అన్ని మున్సిపాల్టీలను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జోరుగాజరుగుతోంది.

Telangana: గ్రేటర్ హైదరాబాద్‎కు పోటీగా మరో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు.. హైడ్రా ప్రణాళికలు ఇవేనా..
Ghmc
Follow us on

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వాహణ విభాగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న అన్ని మున్సిపాల్టీలను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తుందనే ప్రచారం జోరుగాజరుగుతోంది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక వర్గం గడువు మరో ఏడాదికి పైగా ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 29 మున్సిపాల్టీల పాలక వర్గాల గడువు ఈ ఏడాది డిసెంబర్‎తో ముగుస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న మున్సిపాల్టీలను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రమాణికంగా తీసుకుని గ్రేటర్‎ను విస్తరించాలని తొలుత ప్రభుత్వం భావించినా.. రాజకీయ కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‎తో గ్రేటర్ చుట్టూ ఉన్న 22 మున్సిపాల్టీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ల పాలకవర్గాల కాలపరిమితి ముగిసిపోతోంది. ఈ 29 మున్సిపాల్టీల భవిష్యత్‎పై నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‎ను కొంత మేరకు విస్తరించే అవకాశాలున్నాయి. కంటోన్మెంట్ లాంటి ప్రాంతాన్ని గ్రేటర్‎లో విలీనం చేసుకోనున్నారు. ఇకపోతే హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాల్టీలను మరో రెండు కొత్త మున్సిపల్ కార్పోరేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీకి ఒకవైపు ఉన్న నిజాంపేట, జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, అబ్దుల్లాపూర్ మెట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, ఘటకేసర్, పోచారం, దుండిగల్, తూంకుంట మున్సిపాల్టీలను కలిపి.. గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాల్టీలను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‎కు మరోవైపున్న మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్ పల్లి, బడంగ్ పేట, తుక్కుగూడ, ఆదిభట్ల, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాల్టీలతో పాటు మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ.. గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి.. మహేశ్వరాన్ని మహానగరంగా మారుస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జీహెచ్ఎంసీకి సమాంతరంగా గ్రేటర్ చుట్టూ మరో రెండు మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రఫ్ డ్రాఫ్ట్ అమలులోకి వచ్చేసరికి ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..