Narkuti Deepthi Microsoft: అమెరికాలో తెలుగు వారు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అక్కడి టాప్ కంపెనీల్లో భారీ వేతనంతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటూ తెలుగు వారు తమ హవాను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి అనే యువతి మైక్రోసాఫ్ట్ మెయిన్ క్యాంపస్‌లో ఏకంగా రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో ఉద్యోగం సాధించి సత్తా చాటారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన నర్కుటి దీప్తి ఇక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఫ్లోరిడా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు. ఇక కోర్సు పూర్తి అయ్యేకంటే ముందే వర్సిటీలో క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీప్తికి గోల్డ్‌మన్ సాక్స్, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి సంస్థల్లో ఉద్యోగం లభించింది. అయితే దీప్తి మాత్రం మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించారు. ప్రస్తుతం దీప్తి ఈ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ గ్రేడ్ పోస్టుకు ఎంకిపయ్యారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ దీప్తికి ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తం 300 మంది విద్యార్థులు సెలక్ట్ కాగా.. అందరిలో అత్యధిక జీతంతో దీప్తి ఉద్యోగానికి ఎంపికయ్యారు. దీప్తి మే 17న అమెరికాలోని సియాటెల్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో విధులకు హాజరు కానున్నారు.