
హైదరాబాద్ పరిధిలోని మందుబాబులకు అలర్ట్.. రెండు రోజులపాటు (48 గంటలు) వైన్ షాపులు బంద్ కాబోతున్నాయి.. దీనిపై పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుంచి జూలై 15న ఉదయం 6 గంటల వరకు 11 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గాంధీ నగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారం గేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్.. మొత్తం 11 పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని.. పోలీసు వారికి అందరూ సహకరించాలని కోరారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..