Telangana: తాగే నీరు అట్ట పెట్టెల్లో ఇస్తారట.. ఎక్కడో మీకు తెలుసా??
మనిషి పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు కావాల్సింది మంచి నీళ్ళు. అయితే ఆ నీళ్ళ ను మనం పర్యావరణానికి ఎంత గానో హాని చేసే ప్లాస్టిక్ క్యాన్లు, బాటిల్ లలో తాగేయడం అలవాటు పడిపోయాం....
(శ్రావణి, టీవీ9 తెలుగు, హైదరాబాద్)
మనిషి పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు కావాల్సింది మంచి నీళ్ళు. అయితే ఆ నీళ్ళను మనం పర్యావరణానికి ఎంత గానో హాని చేసే ప్లాస్టిక్ క్యాన్లు, బాటిల్ లలో తాగేయడం అలవాటు పడిపోయాం..ఓ వైపు పర్యావరణ పరిరక్షణ చేయాలని భావిస్తూనే ఇలా ప్లాస్టిక్ ను విపరీతంగా వాడేస్తున్నాం.. అయితే హైదరాబాద్ కుర్రాళ్ల కు వచ్చిన ఒక వినూత్నమైన ఐడియా ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. మంచి నీళ్ళ ను ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎలాంటి హాని చేయని అట్టపెట్టె లలో కూడా స్టోర్ చేయొచ్చు అంటున్నారు. అసలు మంచినీరు అట్టపెట్టెలలో పోయడం ఏంటి అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో వాటర్ క్యాన్స్ కనిపిస్తుంటాయి. మంచినీటి కరువున్న రాజధాని మహానగరవాసుల్లో ఇది నిత్యజీవితంలో భాగం అయింది. అయితే ఆ వాటర్ క్యాన్లను, బాటిళ్లను ప్లాస్టిక్‌తో తయారుచేస్తారు అనే విషయం మన అందరికీ తెలుసు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్లాస్టిక్ బాటిల్ లలోని నీళ్లనే తాగేస్తున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వాటర్ బాటిళ్లలో 10 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. మిగతా 90 శాతం భూమిలోకి చేరుతున్నాయని అంచనా ఉంది. వాటివల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. అందుకే.. ఆ సమస్యకు చెక్ పెట్టేలా దేశంలోనే తొలిసారి పేపర్ బాక్స్ లో మినరల్ వాటర్ను అందించాలనే ఓ వినూత్న ఐడియాతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ కుర్రాళ్లు ( సునీథ్ , చైతన్య) ముందుకొచ్చారు.
పేపర్ వల్ల పర్యావరనానికి ఎలాంటి హాని జరగదు. అందుకోసమే పర్యావరణ అనుకూల కార్టన్ బాక్సులను ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ఇంజిన్ ఆయిల్స్, జ్యూస్‌ల ప్యాకింగ్‌కు వినియోగిస్తున్నాయి. అదే సాంకేతికతను ఈ వాటర్ బాక్స్‌లలో కూడా వినియోగించారు. భారతదేశంలో మంచి నీటి కోసం ఈ తరహా బాక్స్‌ను రూపొందించిన తొలి సంస్థ తమదే అట. కేవలం పర్యావరణాన్నేగాక.. వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించినట్టు చెబుతున్నారు. ఒక రోజులో మనిషికి అవసరమైన రాగిలో 20 శాతాన్ని ఈ నీటిలో జోడించామంటున్నారు. రాగి చెంబులో నీళ్లు రాత్రంతా ఉంచుకుని ఉదయమే తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో… ఈ నీటిని తాగడం వల్ల అంతే ప్రయోజనం అంటున్నారు. కారో పేపర్ వాటర్ బాటిల్స్‌ను 5, 10, 20 లీటర్ కార్టన్స్‌లో అందిస్తున్నారు. ప్రతి కార్టన్‌కూ ప్రత్యేకంగా ట్యాప్ ఉండటం వల్ల నీరు వ్యర్థం కాదు. ప్రస్తుతానికి నగరంలో కొన్ని సూపర్‌మార్కెట్‌లలో 5 లీటర్ల కార్టన్స్ దొరుకుతున్నప్పటికీ.. కారో వాటర్ యాప్ ద్వారా హోమ్ డెలివరీని అందిస్తున్నారు. కార్టన్ బ్యాగ్స్ ని తిరిగి అందజేస్తే రివార్డ్ పాయింట్లనూ అందజేస్తున్నారు. సో మీరు ట్రై చేయండి.. అట్ట పెట్టెల్లో వచ్చే నీటిని ఆస్వాదించండి…!!
Also Read: