International Yoga Day: 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ కార్యక్రామానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. సినీ నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు యోగాసనాలు వేశారు.
అనంతరం ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది. యోగా కులమతాలకు అతీతమైంది, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక. ప్రపంచదేశాల్లో శాంతికి దోహదం చేస్తుంది, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి. ఏ స్థాయిలో ఉన్నా యోగా తప్పనిసరి సాధన చేయాలి. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది’ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.
పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలి…
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యోగా చేయాలి. యోగాను అందరూ అలవాటు చేసుకోవాలి. పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమం’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..