CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం యోగి.. భద్రతా వలయంలో చార్మినార్‌

|

Jul 03, 2022 | 6:52 AM

CM Yogi Adityanath: చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండటంతో..

CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం యోగి.. భద్రతా వలయంలో చార్మినార్‌
Follow us on

CM Yogi Adityanath: చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ నేతలు తరలివస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన పలువురు ముఖ్య నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆలయానికి ఈ రోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. షెడ్యూల్ ప్రకారం నిన్ననే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆదిత్య నాథ్ సందర్శించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ రోజుకు వాయిదా పడింది. ఉదయం యోగితోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అసలే భాగ్యలక్ష్మి టెంపుల్‌ విషయంలో గతం నుంచి వివాదం ఉంది. అందులోనూ ఆదిత్యనాథ్‌ సందర్శించనున్నారంటే పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి

బీజేపీ జాతీయ కార్యవర్గాల వేళ భాగ్యలక్ష్మి ఆలయం సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. దీనికి కారణం పలువురు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఈ ఆలయాన్ని సందర్శిస్తుండటమే. ఇప్పటికే బీహార్‌ డిప్యూటీ సీఎం తారా కిశోర్‌ ప్రసాద్‌, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తదితరులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇవాళ ఆదిత్యనాథ్‌ సందర్శించి పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగత పలకడానికి, అమ్మవారి ఆలయంలో జరిగే మహా హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో హిందువులు తరలిరావాలని తెలంగాణ బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.

అయితే భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న ప్రాతం మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ రాజకీయ గడ్డపై ఉంది. ఇప్పటికే ఒవైసీ ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయం విషయంలో గతం నుంచి వివాదం ఉంది. 2020 హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు సీఎం ఆదిత్యనాథ్‌. ఆ ఎన్నికల్లో 47 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రెండేళ్ల కిందటే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అయితే యోగి అప్పుడు ఆలయాన్ని సందర్శించలేదు. కానీ హైదరాబాద్‌కు భాగ్యనగర్‌గా పేరు మార్చాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ మళ్లీ భాగ్యలక్ష్మి ఆలయం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి