Watch Video: రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. క్రికెట్‌ బ్యాట్‌లతో బైకర్స్‌పై దాడి.. అసలు ఏం జరిగిందంటే!

హైదరాబాద్‌లోని బండ్లగూడలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి, కారు డ్రైవర్‌కి మధ్య చిన్నగా మొదలైన గొడవ కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. కారులోంచి దిగిన కొందరు వ్యక్తులు బైక్‌పై ఉన్న వ్యక్తులపై క్రికెట్‌బ్యాట్‌లతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైకర్స్‌పై దాడి చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Watch Video: రోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. క్రికెట్‌ బ్యాట్‌లతో బైకర్స్‌పై దాడి.. అసలు ఏం జరిగిందంటే!
Hyderabad Viral Video

Updated on: Aug 25, 2025 | 9:44 PM

బైక్‌పై వెళ్తున్న వ్యక్తులతో వివాదం నేపథ్యంలో కార్లో నుంచి దిగిన కొందరు వ్యక్తులు.. బైక్‌పై ఉన్న వారిపై క్రికెట్‌ బ్యాట్‌లతో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఆదివారం సాయంత్రం బండ్లగూడలోని రద్దీగా ఉండే రహదారిపై బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కారును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. కారును ఢీకొట్టిన వెంటనే బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడిపోయినట్టు మనం వీడియోలో చూడవచ్చు.

అయితే కారులోంచి దిగిన కొందరు వ్యక్తులు.. ఆ బైకర్స్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌లలో వారిపై దాడి చేశారు. స్థానిక వాహనదారులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు. అలానే బైకర్స్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

ఈ వీడియో వైరల్ అయి నగరంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో బండ్లగూడ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్‌పై ఉన్న వ్యక్తులపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులకు చెందిన వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, దాని రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.