TSRTC: హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. నగరంలో ఇకపై ఆ బస్సులు..

నగరంలో పలు రూట్లలో ఈ బస్సులను నడపాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఏ రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఏయే రూట్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.?

TSRTC: హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. నగరంలో ఇకపై ఆ బస్సులు..
TSRTC

Updated on: Sep 02, 2023 | 7:46 AM

ప్రయాణికుల అవసరాలు, సౌకర్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ఎయిర్‌పోర్ట్‌కు, అలాగే విజయవాడకు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయితే తాజాగా ఈ బస్సులు నగరంలోనూ నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

నగరంలో పలు రూట్లలో ఈ బస్సులను నడపాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొన్ని రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఏ రూట్స్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఏయే రూట్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.? ఏయే రూట్లలో ఈ బస్సులు నడిపితే సంస్థకు ఆదాయం వస్తుందన్న విషయాలపై ఆర్టీసీ ఆన్‌లైన్‌ సర్వే సైతం నిర్వహిస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత బస్సులను నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులు మంచి అనుభూతిని అందిస్తున్నాయి. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు అందించారు. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో మొత్తం 35 సీట్లు ఉంటాయి. అలాగే మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సీటుకొక పోర్ట్‌ను అందించారు. భద్రత కోసం బస్సులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. బస్ స్టాపులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుగా ఎల్‌ఈడీ బోర్డులను ప్రదర్శిస్తారు. ఇక ఈ బస్సు ప్రత్యేకతల విషయానికొస్తే ఒక్కసారి ఛార్జింగ్ చస్తే ఏకంగా 225 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. బస్సు ఫుల్ ఛార్జ్‌ కావడానికి 2 గంటల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రయాణికుల భద్రత కోసం ఈ బస్సులో ప్రతీ సీటుకు ఒక పానిక్‌ బటన్‌ను అందించారు. అలాగే వెహికల్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ను సైతం ఇచ్చారు. బస్సులో సీటు బెల్ట్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒలెక్ట్రా కంపెనీ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా 500 ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే త్వరలోనే 25 బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..