సెస్ బాదుడు, ఛార్జీల పెంపు, కనీస టిక్కెట్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. మరో రూపంలో ప్రయాణీకులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సుల్లో(Special Bus) అదనపు బాదుడును సగానికి తగ్గించింది. వేసవి సెలవులు, పండగల సమయాల్లో నడిపే స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటివరకు 50శాతం అదనంగా ఛార్జీలు(Additional Charges) వసూలు చేస్తోంది. ఇక నుంచి ఆ ఛార్జీలను 25శాతం మాత్రమే వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. పండుగలు, జాతరలు, వీకెండ్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో ఎప్పటినుంచో అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ఆ సమయాల్లో ప్రయాణం చేసేవారికి ఆర్థికంగా భారమవుతోంది. దీనికి తోడు ఇటీవల డీజిల్ ధరలు పెరగడంతో పల్లెవెలుగు బస్సుల్లో రూ.5, మిగిలిన అన్ని బస్సుల్లో రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో పాటు సేఫ్టీ సెస్, బస్టాండుల్లో కనీస సౌకర్యాలు, టోల్‌ఛార్జీలు, టికెట్టు ధరను సమీప రూపాయికి సవరించడం వంటి చర్యల పేరుతో ఆర్టీసీ.. ప్రయాణికులపై మోయలేని భారం మోపింది. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఫైల్ ఆమోదం పొందితే ఛార్జీలు కనీసం 30శాతం వరకూ పెరిగే అవకాశముంది. దీంతో ప్రజలు ఆర్టీసీ బస్సులకు దూరమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సుల్లో అధనంగా వసూలు చేసే ఛార్జీని 25శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో అదనపు ఛార్జీ 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అంచనా వేశారు. దీనిపై అధికారులతో చర్చించి అదనపు వసూలును తగ్గించాలని నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
RJPL IPO: రిలయన్స్ గ్రూప్ నుంచి రెండు భారీ ఐపీఓలు..! RIL AGM సమావేశంలో వెల్లడించే అవకాశం..!