TSPSC Paper Leak: తెలంగాణలో ప్రవీణ్ లీక్స్ ప్రకంపనలు.. హైదరాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

|

Mar 14, 2023 | 5:32 PM

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌తో హైదరాబాద్‌ అట్టుడుకుతోంది. జీవితాలను ఫణంగా పెట్టి చదువుతోన్న లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిప్పు రగిల్చింది పేపర్‌ లీక్స్‌ ఎపిసోడ్. నిరుద్యోగుల జీవితాల్లో ప్రకంపనలు రేపిన పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తెలంగాణలో అగ్గిరాజేసింది.

TSPSC Paper Leak: తెలంగాణలో ప్రవీణ్ లీక్స్ ప్రకంపనలు.. హైదరాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..
Tspsc
Follow us on

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌తో హైదరాబాద్‌ అట్టుడుకుతోంది. జీవితాలను ఫణంగా పెట్టి చదువుతోన్న లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిప్పు రగిల్చింది పేపర్‌ లీక్స్‌ ఎపిసోడ్. నిరుద్యోగుల జీవితాల్లో ప్రకంపనలు రేపిన పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తెలంగాణలో అగ్గిరాజేసింది. కడుపుమండిని విద్యార్థులు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించారు. BJYM, NSUI, TJS విద్యార్థులు TSPSC కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఓయూ దగ్గర విద్యార్థి సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగిన విద్యార్థులు TSPSC చైర్మన్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. TSPSCలో పేపర్ల లీక్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ.. పటిష్టమైన భద్రతల మధ్య జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్‌ పేపర్‌ కూడా లీకైనట్లు అనుమానాలు రావడంతో యావత్‌ రాష్ట్రంలో నిరుద్యోగుల గుండెలు గుభేల్‌ మంటున్నాయి. తల్లిదండ్రుల కష్టాలను కడగండ్లను దిగమింగుకొని.. పైసా కూడబెట్టి పట్టణాల్లో చదువుకోసం పంపిస్తే…తినీ తినకా…అష్టకష్టాలు పడి చదువుకొని పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఈ అనుమానం కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు నీరుగారిపోతున్నాయన్నారు NSUI విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్‌.

టీఎస్‌పీఎస్‌సీని కుదిపేస్తున్న లీక్స్‌ సూత్రధారి ప్రవీణ్‌ వ్యవహారం కదిలిస్తే గబ్బు రేపుతోంది. తుట్టెలా మారిన TSPSC పేపర్‌లీక్ వ్యవహారంలో ఆరా తీస్తున్న కొద్దీ బయటపడుతున్న పేపర్‌ లీక్స్‌కి సంబంధించిన సంచలన విషయాలు తెలంగాణలో ఉన్నతోద్యాగాల పరీక్షావిధానంపైనే విశ్వాసం కోల్పోయేలా తయారయ్యింది. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. జనవరి 13 న ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కీలక సూత్రధారి ప్రవీణ్‌ పాపాల చిట్టా హడలెత్తిస్తోంది. ఈ పేపర్‌ లీక్‌ స్కాం వెనుక మాస్టర్‌ మైండ్‌ ప్రవీణ్‌ కుమార్‌ తను గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు పేపర్‌ లీక్‌ చేశాడన్న అనుమానం నిజమౌతోంది. ఎందుకూ కొరగాక పోయినా….ఎటువంటి ప్రతిభాపాటవాలు లేకపోయినా లీకు వీరుడు ప్రవీణ్‌ కుమార్‌ కి103 మార్కులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడే కాదు అప్పుడు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 103 మార్కులు తెచ్చుకున్నా…రాంగ్ బబ్లింగ్‌తో ప్రవీణ్‌ క్వాలిఫై అయ్యాడు… ఇప్పుడు ప్రవీణ్‌ గ్రూప్‌ 1 పేపర్‌ లీక్‌పై అధికారులు దృష్టిసారించారు. ప్రవీణ్‌ పరీక్షాప్రతం… గ్రూప్‌1 పేపర్‌ లీకేజ్‌ అనుమానాన్ని బలపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్కటి కాదు.. గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల నియామకాల్లోనూ ప్రవీణ్‌ వీరప్రతాపం చూపించినట్టు తెలుస్తోంది. రిజెక్ట్‌ అయిన వారినీ పిలిపించి పైరవీలు చేశాడు. లెక్చరర్‌గా పనిచేసి ఉండాలన్న నిబంధనకు నీళ్ళొదిలి..ఫేక్‌ ఐడీ కార్డులతో జిమ్మిక్కులు చేసి ఉద్యోగాలిప్పించినట్టు వస్తున్న ఆరోపణలు అందర్నీ హడలెత్తిస్తున్నాయి. మరోవైపు టీవీ9 చేతికి TSPSC లీకేజీ FIR రిపోర్టు చిక్కింది. TSPSC పేపర్‌ లీక్‌పై ఐటీయాక్ట్‌ నమోదు చేశారు బేగంబజార్‌ పోలీసులు. IPC 409తో పాటు ఐటీయాక్ట్ 66బీ,66సి కింద కేసు నమోదు చేశారు. ఈనెల 11న బేగంబజార్ పోలీసులకు TSPSC అసిస్టెంట్ సెక్రెటరీ అడ్మిన్ సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కు అనుమతి లేకుండా ప్రవీణ్ కుమార్ వెళ్ళినట్టు ఆరోపించారు సత్యనారాయణ.

మనోడి మోసాల చిట్టా…సరే… అసలు దీని వెనుక ఎవరెవరున్నారో బయటకు లాగాలంటున్నారు విద్యార్థులు. ఒక్కడే ఒంటి చేత్తో ఇంతా చేయగల సత్తా ఉంటుందా? లేక ప్రవీణ్‌ అక్రమాల వెనుక ఎవరెవరున్నారనే విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీంతో అధికారులు కీలక అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రూప్‌1 ప్రిలిమినరీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే రాష్ట్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం పొంచి వుంది. దీంతో అన్ని విషయాల్నీ నిశితంగా పరిశీలిస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. ఏఈ ఎగ్జామ్, గ్రూప్1 ప్రిలిమినరీపై రివ్యూ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..