నగరవాసులకు ముఖ్య గమనిక.. ఆదివారం (ఫిబ్రవరి 26) గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత దిగ్గజం, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ కారణంగా ఈ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా సంగీత కచేరి జరగనుంది. ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సీపీ తెలిపారు. అలాగే గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లి వైపు, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు భారీ వాహనాలు అనుమతించరు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ఆర్‌ఎంసీలు, వాటర్ ట్యాంకర్లకు పర్మిషన్ లేదు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్ డిపో వద్ద ఎస్‌ఎంఆర్ వినయ్‌సిటీ, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు మళ్లించనున్నారు.
గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుంది.
రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..