
హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని బెదిరించి.. దాదాపు రూ.1.92 కోట్లను కాజేశారు. ఈ ఘటన పెరిగిపోతున్న సైబర్ నేరాల తీవ్రతను మరోసారి బయటపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడికి కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి… తాము సీబీఐ అధికారులు అని నమ్మబలికారు. ఆయన ఆధార్‌ను దుర్వినియోగం చేసి ముంబైలోని కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ అయినట్టు అబద్ధం చెప్పారు. ఆ అకౌంట్ ద్వారా భారీ మనీ లాండరింగ్ జరిగిందని… ఆయనపై కేసు నమోదైందని భయపెట్టారు. మరింత నమ్మించేందుకు ఆయన పేరు ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం కార్డుతో పాటు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పేరుతో నకిలీ ఎఫ్‌ఐఆర్ పంపించారు. దీంతో వృద్ధుడు భయపడ్డాడు. కేసు మూసివేయాలంటే డబ్బు జమ చేయాలని చెప్పి నమ్మించి… నవంబర్ 7 నుంచి 14 వరకు వివిధ అకౌంట్ల ద్వారా రూ.1,92,50,070 కాజేశారు. కాలక్రమంలో ఇది మోసం అని గ్రహించిన వృద్ధుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం సెక్షన్ 66C, 66D, ఇంకా బీఎన్ఎస్ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో హైదరాబాద్‌కు చెందిన పండు వినీత్ రాజ్, జీ. తిరుపతయ్య, గౌని విశ్వనాథంలను అరెస్ట్ చేశారు. వీరికి తెలంగాణలో రెండు కేసులు సహా దేశవ్యాప్తంగా ఐదు కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు బయటపడింది. ప్రధాన నిందితుడు అలెక్స్ పరారీలో ఉన్నాడు. వినీత్ రాజ్ అకౌంట్ సప్లయర్‌గా, తిరుపతయ్య-విష్వనాథం జాయింట్ అకౌంట్ హోల్డర్స్‌గా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
భారతదేశంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే పద్ధతి అసలు లేదు అని పోలీసులు, అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… ఇంకా జనం మోసపోతూనే ఉన్నారు. ఏ అరెస్ట్ అయినా అధికారులు వ్యక్తిగతంగా వచ్చి, అధికారిక వారంట్‌తోనే చేస్తారు. ఫోన్/వీడియోకాల్ ద్వారా ఎవరూ జరిమానాలు, డిపాజిట్లు అడిగే అవకాశం లేదు. CBI, ED, పోలీస్, కస్టమ్స్ ఇలా ఏ సంస్థా UPI, క్రిప్టో, గిఫ్ట్ కార్డులు ద్వారా డబ్బులు అడగదు. OTP, పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు, ఆధార్, పాన్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దుసీనియర్ సిటిజన్లు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.