
హైదరాబాద్, జనవరి 31: దొంగలు..బాబోయ్ దొంగలు.. ఖతర్నాక్ దొంగలు.. కనురెప్పపాటులో జేబులు గుల్ల చేసే దొంగలు. వీఐపీలు ఉండే ప్రాంతాలనే టార్గెట్‌గా పెట్టుకుంటారు. కనికట్టు మాయాజాలంతో జేబులు కొట్టేస్తారు. ఏకంగా తెలంగాణ భవన్‌లోనే ఓ నాయకుడి నుంచి 50 వేలు కొట్టేశారు. వారిలో ఒకరిని బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ చోరుడి వాట్సాఫ్ చాటింగ్ చూసి ఖాకీలు స్టన్ అయ్యారు. ‘అరెయ్.. నువ్వు రమ్మంటే వినలేదు..! రూ. 50వేలు పడ్డాయి.. నువ్వు వస్తే నీకు షేర్ వచ్చేది కదా..’ అంటూ మరో ఫ్రెండ్‌కు మెసేజ్ పంపాడు ఈ దొంగ.
వివరాల్లోకి వెళ్తే.. చార్మినార్ పటేల్‌బుర్జ్‌కు చెందిన బీఆర్‌ఎస్ లీడర్ జైపాల్‌రెడ్డి ఈనెల 27న తెలంగాణ భవన్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ సదస్సుకు అటెండ్ అయ్యారు. బయటకు వెళ్తున్నాం.. అందులో పార్టీ మీటింగ్.. ఏం అవరసమొస్తుందో అని ఆయన జేబులో రూ.50 వేలు పెట్టుకున్నారు. కాగా సదస్సుకు హాజరైన వారికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్న క్రమంలో జైపాల్‌రెడ్డి జేబులోని రూ.50వేలు దొంగలు చోరీ చేశారు. ఇదే మీటింగ్‌కు హాజరైన గోల్కొండ ఫోర్ట్ ఏరియాకు చెందిన అజంఖాన్, చింతలబస్తీ వీర్‌నగర్‌కు చెందిన శశిధర్ జేబుల్లోని సెల్‌ఫోన్లు సైతం మాయమయ్యాయి. దీంతో ముగ్గురూ బంజారాహిల్స్ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ భవన్‌లో గతంలో జరిగిన మీటింగ్స్‌కు హాజరైన వారి జేబులు గుళ్ల చేసిన మరో రెండు సంఘటనల్లోనూ నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.