
TGSRTC
హైదరాబాద్, ఏప్రిల్ 11: యూనియన్ల పేరుతో ఆర్టీసీపై కొందరు అసత్య ఆరోపణలు చేయడంపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ అయింది. తాజాగా దీనిపై స్పందించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 11) ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తమ మనుగడ కోసం వారు ఇష్టారీతిన మాట్లాడుతూ, ప్రకటనలు జారీ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తాజాగా ఎస్ఆర్‌బీఎస్‌ను సంస్థ రద్దు చేస్తోందంటూ ఉద్యోగులను తప్పుదారి పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. యూనియన్ లీడర్లమంటూ కొందరు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని, పుకార్లని నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.
ఆర్టీసీకి ఉద్యోగులే వెన్నుముక. వారంతా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే సంస్థ మనగలుగుతోంది. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడంతోనే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఆర్టీసీని అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడటం లేదు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్ మెంట్ తో 2024 మే నెలలో అందించింది. పెండింగ్‌లో ఉన్న 11 డీఏలను 2019 నుంచి దశలవారీగా ఉద్యోగులకు విడుదల చేసింది. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో సంస్థ జమచేసింది. ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను సంస్థ అందిస్తోంది.
గత మూడున్నరేళ్లలో పీఎఫ్ కు రూ.2,348.35 కోట్లను, సీసీఎస్ కు రూ. 1300.73 కోట్లను యాజమాన్యం చెల్లించింది. 2021-22 నాటికి పీఎఫ్ బకాయిలు 1,352.82 కోట్లు ఉండగా.. వాటితో పాటు రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ ప్రస్తుతం రూ.580.37 కోట్లకు తగ్గించింది. అలాగే, సీసీఎస్ బకాయిలు 2021-22 నాటికి రూ. 887.48 కోట్లు ఉండగా.. రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ రూ.451.09 కోట్లకు సంస్థ తగ్గించింది. సంస్థలో పీఎఫ్, సీసీఎస్ బకాయిలు 2012 నుంచే ఉన్నాయి. ఇప్పుడే ఆ నిధులను వినియోగించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మూడున్నరేళ్లుగా ఉద్యోగుల సీసీఎస్, పీఎఫ్ రికవరీ మొత్తాలను ఏనెలకు ఆ నెల సకాలంలో సంస్థ చెల్లిస్తోంది. పెండింగ్ లో ఉన్న ఇతర బకాయిలకు చెల్లింపులు చేస్తూ వాటిని క్రమేణా తగ్గిస్తూ వస్తోంది. మిగతా పెండింగ్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లడం జరిగింది. వాటి పరిష్కార విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది.
2021కి ముందు సంస్థ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సంస్థకు డిఫాల్ట్ రేటింగ్ ఇవ్వడంతో ఏ బ్యాంక్ కూడా రుణాలిచ్చేందుకు ముందుకు రాలేదు. ఉద్యోగుల సహకారంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి డిఫాల్ట్ నుంచి బీబీ ప్లస్(BB+) రేటింగ్ కు తీసుకురావడం జరిగింది. దీంతో పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను యాజమాన్యం సంప్రదించి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ద్వారా ఆర్టీసీ పనితీరు, సాధిస్తోన్న పురోగతిని వివరించింది. సంస్థ పురోగతిని, దూరదృష్టిపై సంతృప్తి చెందిన బ్యాంకుల ఉన్నతాధికారులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ రుణాల వల్లనే మూడేళ్లుగా 3 వేలకు పైగా కొత్త బస్సులను సంస్థ సమకూర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం సంస్థలో దాదాపు 50 శాతానికి పైగా కొత్త బస్సులు నడుస్తున్నాయి. కొత్త బస్సులకు అనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 3038 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. వాటి నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే డిపోల ప్రైవేటీకరణ అంటూ లేనిపోని అపోహలను ఉద్యోగుల్లో సృష్టిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి ఉండదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహ, ఆందోళన అవసరం లేదు. మూడున్నరేళ్ల క్రితం సంస్థ ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొని.. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉండేది. అప్పుడు ప్రతి నెల జీతాల చెల్లింపు 25 తేది తర్వాత ఉండేది. కొత్త పాలకమండలి వచ్చాక ప్రతి నెల ఒకటో తేదినే ఉద్యోగులకు వేతనాలను సంస్థ చెల్లిస్తోంది. ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా బ్యాంక్ రుణాల సర్దుబాటు నేపథ్యంలో ఈ మార్చి నెల వేతనాల్లో కొంత జాప్యం జరిగింది. ఈ మార్చి మినహా మూడేళ్లుగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదినే ఉద్యోగులకు వేతనాలను సంస్థ చెల్లిస్తూ వచ్చింది. భవిష్యత్ లో వేతనాల విషయంలో ఎలాంటి జాప్యం జరగుకుండా సంస్థ చర్యలు తీసుకుంటుంది.
మరణించిన, మెడికల్ అన్ ఫిట్ అయిన 2511 మంది ఉద్యోగుల పిల్లలు, జీవిత భాగస్వాములకు కారుణ్య నియమాకాల ద్వారా ఉద్యోగాలను సంస్థ కల్పించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులు, అధికారులను గుర్తించడం సంస్థ సంప్రదాయంగా మార్చుకుంది. కార్పొరేట్, జోనల్, డిపో.. ఇలా మూడు లెవల్ లో ఉద్యోగులు, అధికారులను గుర్తించి.. ప్రతి ఏటా పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిని సన్మానిస్తోంది. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను సంస్థ ప్రారంభించింది. మూడు దఫాలుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో 45 వేల మందికి పైగా ఉద్యోగులు, 31,000 మందికి పైగా ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలను నిర్వహించింది. అందరి హెల్త్ ప్రొఫైల్స్ ను రూపొందించింది. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 900 మందికి అత్యవసర చికిత్సను అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తూ హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయి MRI, CT స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరఫి యూనిట్ ను కొత్తగా సంస్థ ఏర్పాటు చేసింది.
తార్నాక ఆర్టీసీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 15 డిస్పెన్సరీలను కూడా విస్తరించింది. కొత్తగా నాగర్ కర్నూల్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లా కేంద్రాల్లో డిస్పెన్సరీలను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు అందించే మెడిసిన్ కు ప్రతి ఏటా సగటును రూ.15 కోట్లను సంస్థ ఖర్చు చేస్తోంది. అలాగే, రిఫరల్ ఆస్పత్రులకు రూ. 22 కోట్లను వెచ్చిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది. వీఆర్ఎస్, మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకూ వైద్య సదుపాయాన్ని సంస్థ అందిస్తోంది. గత ఏడాది జులై నుంచి ఈ వైద్య సదుపాయాన్ని వారు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు, తార్నాక ఆస్పత్రికి అనుబంధంగా ఒక నర్సింగ్, ఒక ఒకేషనల్ కళాశాలలను ఏర్పాటు చేసి.. అందులో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోటాను సంస్థ కేటాయించింది.
గతంలో రోడ్డు ప్రమాద కేసుల్లో కారణాలతో నిమిత్తం లేకుండా డ్రైవర్లు ఉద్యోగాలు కొల్పోయేవారు. మూడేళ్లుగా అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ప్రమాదానికి గల కారణాలను అధికారులు క్షుణంగా పరిశీలిస్తున్నారు. అందులో తప్పేమి లేదని నిర్ధారణ అయితే డ్రైవర్ కి ఎలాంటి నష్టం జరగుకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం పైన పేర్కొన్న అనేక కార్యక్రమాలను యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలూ వస్తున్నాయి. కానీ అవేం తమకు పట్టనట్టుగా కొందరు అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుని.. ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
సంస్థలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని యాజమాన్యం విస్మరిస్తోందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. గత మూడున్నరేళ్లుగా సంస్థలో సంక్షేమ పరంగా ఎలాంటి సంస్కరణలను యాజమాన్యం తీసుకువచ్చిందో ఉద్యోగులకు తెలుసు. యూనియన్ లీడర్లు అవేం పట్టించుకోకుండా రోజుకో ప్రకటనను జారీ చేస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహారించడం అనేది మంచి పద్దతి కాదు. ఎంతో కాలం సంస్థపై ఆధారపడి జీవించి.. పదవీవిరమణ చేసిన తర్వాత బయటకు వెళ్లి టీజీఎస్‌ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించే నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. ఇప్పటికైనా సంస్థపై దుష్ర్పచారాన్ని మానుకోవాలని యాజమాన్యం హితవు పలుకుతోంది. తమ మనుగడ కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఆరోపణలను నమ్మి ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేస్తోంది. అసలు ఎస్ఆర్బీఎస్ మూసివేత అంశ ప్రతిపాదనే యాజమాన్యం చేయలేదని, ఉద్యోగులను రెచ్చగెట్టేందుకే కొందరు ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారని, అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దని సూచిస్తోంది. ఉద్యోగులకు లబ్ది చేకూర్చే అన్ని అవకాశాలను సంస్థ పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.
మూడున్నరేళ్లుగా కొందరు యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనేక సార్లు ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ ఉద్యోగులు తిప్పికొడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మద్దతు తెలుపుతున్నారు. సంస్థ వెన్నంటే తాము ఉన్నామని నిరూపిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు సంస్థపై చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను ఉద్యోగులు నమ్మరని యాజమాన్యం విశ్వసిస్తోందని టీజీఎస్ఆర్టీసీ ధీమా వ్యక్తం చేసింది.