Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. మరో 2 రోజులు భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ చేసిన IMD

Telangana Rain Alert: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీశాయి. భారీ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఈఎస్‌ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఫిలింనగర్‌, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కుండపోత వాన..

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. మరో 2 రోజులు భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ చేసిన IMD
Hyderabad Rains

Updated on: Jun 06, 2024 | 5:42 PM

హైదరాబాద్, జూన్‌ 6: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీశాయి. భారీ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఈఎస్‌ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఫిలింనగర్‌, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వర్షం ధాటికి రాహదారులన్నీ నీటమునిగాయి. వెంటనే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారుల, పాదచారులు ఇబ్బంది పడ్డారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు రాత్రికి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

శుక్రవారం, శనివారం నగరంలో ఇదే మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం సాయంత్రం కూడా ఇదే మాదిరి వాన విరుచుకు పడింది. వర్షం నీరు రోడ్డపైకి చేరడంతో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. సూర్యాపేట‌, న‌ల్లగొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో బుధవారం రాత్రంతా వాన ప‌డింది. ఈ జిల్లాల్లో 170 నుంచి 180 మిల్లీమీటర్ల మ‌ధ్య వ‌ర్షపాతం న‌మోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.