మణిపూర్ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ వేరే ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో అక్కడున్న తెలుగు విద్యార్థులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్షేమంగా వచ్చేందుకు చర్యలు తీసుకుని.. విమానాన్ని ఏర్పాటు చేశాయి. మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఇంఫాల్ నుంచి బయల్దేరిన విమానం.. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఏపీ, తెలంగాణకు చెందిన 178మంది విద్యార్థులు ఒకే ఫ్లైట్‌లో తీసుకొచ్చారు అధికారులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమన్వయంతో తరలింపు ప్రక్రియను చేపడుతున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విద్యార్థుల్ని స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 11 బస్సుల్ని సిద్ధం చేశారు. ఇందులో ఏపీకి 7 బస్సులు.. తెలంగాణ 8 బస్సులు వెళ్లనున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 178మంది విద్యార్థుల్ని స్వస్థలాలకు తరలించనున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఎయిర్‌పోర్ట్‌కి రావొద్దని ముందస్తుగానే సమాచారమిచ్చారు అధికారులు. అంతా తామై చూస్తున్న అధికారులు.. పోలీసు భద్రత మధ్య విద్యార్థుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇక విద్యార్థులు సేఫ్‌గా వస్తుండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న విద్యార్థులను అధికారులు బస్సుల్లో సొంతూళ్లకు తరలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..