హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ మురళీ కృష్ణతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలెటింగ్, డ్రోన్ డేటా మేనేజ్ మెంట్, డేటా అనాలసిస్ పై ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఎన్.ఆర్.ఎస్సీ శాస్త్రవేత్తలకు, అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలెట్లకు డేటా అనాలసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని, పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని, కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు డోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారని అధికారులు వివరించారు. ఉన్నత స్థాయి నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణను ఇవ్వాలని సీఎం సూచించారు.
దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించినందుకు సీఎంను అభినందించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్.ఆర్.ఎస్సీ డ్రోన్ టెక్నాలజీని మరింత సాంకేతికంగా వినియోగించుకునేందుకు ఈ శిక్షణలో భాగస్వామ్యం పంచుకుంటుందని అన్నారు. దేశంలో 12 సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లోనే డ్రోన్ పైలెట్లకు శిక్షణనిస్తున్నామని, అక్కడున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలెట్ల శిక్షణకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం.. ఏమేం నిర్మాణాలు చేపడుతారని ఆరా తీశారు. పైలెట్ల శిక్షణతో పాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపున ఉన్న స్థలాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్లో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. హైదరాబాద్ పరిసరాల్లో డ్రోన్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకుయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాడైన పాత రన్-వేలను కొత్తగా నిర్మించటంతో పాటు అక్కడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. అడ్డంకులేమైనా ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్నఅవకాశాలను పరిశీలించి ఎయిర్ పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.