
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై స్పీకర్ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు MLAల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పును వెలువరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని.. MLAల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఐదుగురు MLAలపై ఆరోపణలు తోసిపుచ్చిన స్పీకర్.. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు ఫిరాయింపు MLAల కేసులో ఐదుగురు ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లను కొట్టేశారు. అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌కు ఊరట కలిగింది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటీషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.. ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై 19న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.. ఈ క్రమంలోనే.. స్పీకర్ ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది.
రేపటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో.. 8 మంది ఎమ్మెల్యేలను విడతల వారీగా విచారించిన స్పీకర్ ప్రసాద్ చివరకు తన నిర్ణయం ప్రకటించారు. పార్టీ మారలేదని.. బీఆర్ఎస్‌లోనే ఉన్నామని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు వాదన వినిపించారు. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని.. ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేల వివరణపై స్పీకర్ సంతృప్తి చెంది.. బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్‌పై స్పీకర్ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. మరోవైపు స్పీకర్ నోటీసులకు కడియం, దానం, మరింత సమయం కావాలన్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉంది.
ఈ ఐదుగురిపై అనర్హత పిటిషన్ వేసిన BRS ఎమ్మెల్యేలు కూడా తమ వాదనను వినిపించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను స్పీకర్‌కు సమర్పించారు. అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్‌ను కోరారు. స్పీకర్.. క్లీన్ చిట్ ఇవ్వడంతో.. ఎల్లుండి సుప్రీంకోర్ట్‌కు BRS తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. ఎల్లుండి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ జరుగుతుండటంతో.. సుప్రీంకోర్ట్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..