అసోం (Assam) సీఎం హిమంత బిశ్వశర్మపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయన భాష సరిగ్గా లేదన్న మంత్రి తలసాని.. అందుకే ఆయనను స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. గణేశ్ నిమజ్జనాల కోసం వచ్చిన అసోం సీఎం గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు. బీజేపీ (BJP) నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని ప్రశ్నించారు. వినాయక నిమజ్జనాల కోసం హైదరాబాద్ వచ్చిన అసోం ముఖ్యమంత్రి కి నిరసన సెగ తగిలింది. ఎంజే మార్కెట్‌లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
ఘటన జరిగిన అనంతరం హిమంత బిశ్వశర్మ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని అన్నారు. మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలని, కేవలం ఒక్క కుటుంబం కోసమే కాదని చెప్పారు. మరోవైపు.. గణేశ్ నిమజ్జన వేడుకలు హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వివిధ ప్రాంతాలలోని వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై బారులు తీరాయి. భక్తుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..