ఇంటర్ బోర్డు ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణలో దుమారం రేగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలతో పరిస్థితి తీవ్ర రూపు సంతరించుకుంది. మూల్యాంకనంలో తప్పుల దొర్లడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రెండు రోజులుగా ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నారు. అటు రాజకీయ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇంటర్ బోర్డు వ్యవహారం రాష్ట్రాన్ని ఊపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఇంటర్మీడియెట్ సమాధాన పత్రాల రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్‌తో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచారు. ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే ఫలితాల్లో తప్పులకు ఇంటర్ బోర్డే బాధ్యత వహించాలని..రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగా చేయాలని విద్యార్థి డిమాండ్ సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ అందుకు అధికారులు అంగీకరించలేదు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ప్రయత్నించినప్పటికీ లింక్ ఓపెన్ కావడం లేదు. అటు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.