
ఏళ్ల తరబడి సాగిన భార్యాభర్తల న్యాయపోరాటానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది. దంపతుల మధ్య జరిగిన వివాహ వివాదంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు సమర్థించింది. అదే సమయంలో భార్యకు శాశ్వత భరణంగా రూ.50 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రూ.50 లక్షలను ఒకేసారి (లంప్‌సమ్) చెల్లించాలని.. ఇది భరణం, ఆస్తి వివాదాలు తదితర అన్ని పెండింగ్ క్లెయిమ్‌లకు తుది పరిష్కారంగా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లో ఈ మొత్తం చెల్లించిన తర్వాత భర్త ఆస్తులపై భార్య, కుమార్తె మరే ఆర్థిక హక్కులు కోరలేరని ఆదేశించింది. జస్టిస్ కే. లక్ష్మణ్, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. దంపతుల మధ్య నమ్మకం పూర్తిగా కోల్పోయిందని, ఇంతకాలం విడిగా ఉండటం, అనేక కేసులు నడవడం వల్ల సంబంధం తిరిగి మలుపు తిరగని దశకు చేరిందని వ్యాఖ్యానించింది.
ఈ దంపతులు 2002లో వివాహం చేసుకున్నారు. 2003లో కుమార్తె పుట్టిన కొద్దికాలానికే వేర్వేరుగా జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత 498-ఏ కేసులు, భరణం పిటిషన్లు, కుమార్తె పేరుతో ఉన్న గిఫ్ట్ డీడ్‌పై వివాదం ఇలా అనేక కేసులు కోర్టుల చుట్టూ తిరిగాయి. క్రూరత్వం, విడిచిపెట్టడం కారణాలపై భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి ఫ్యామిలీ కోర్టు 2015లో విడాకులు మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ భార్య దాంపత్యం తిరిగి కొనసాగించడం కోసం అప్పీల్ చేసింది. హైకోర్టు ఈ అప్పీల్‌ను కొట్టివేసింది. కుమార్తె కోసం కలవాలన్న వాదన చేసినప్పటికీ, వాస్తవంగా కలిసి జీవించాలనే ఆసక్తి కనిపించలేదని పేర్కొంది. బలవంతంగా కలిపితే మరిన్ని వివాదాలే పెరుగుతాయని స్పష్టం చేసింది. రూ.50 లక్షల శాశ్వత భరణంతో వివాహ బంధానికే కాదు, ఆర్థిక..ఆస్తి వివాదాలకు కూడా పూర్తిస్థాయి పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ తీర్పు ఇచ్చినట్లు హైకోర్టు వెల్లడించింది.