Tamilisai Soundararajan: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు.. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలు..

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జరగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నామని.. బాధగా ఉందన్నారు...

Tamilisai Soundararajan: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు.. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలు..
Governor Tamilisai

Updated on: Jun 10, 2022 | 3:13 PM

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జరగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నామని.. బాధగా ఉందన్నారు. తన బాధ అంతా మహిళల గురించే అని చెప్పారు. ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. గ్యాంగ్‌రేప్‌ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని గుర్తు చేశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని గవర్నర్‌ వాపోయారు. గవర్నర్‌ను కలవాలంటే ప్రజల్లో భయం కూడా ఉందని… ప్రజలు నిర్భయంగా వారి సమస్యలు తెలపవచ్చని తెలిపారు.  ఒక మహిళగా తోటి ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొంటే చూడలేనని గవర్నర్ చెప్పారు. బాధిత మహిళలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఆలంబనగా.. తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

24 గంటల క్రితమే మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మంచి స్పందన వచ్చిందని. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళా దర్బార్ నిర్వహించానని వివరించారు. మహిళలకు అండగా ఉండాలనే మహిళా దర్బార్ నిర్వహించామని గవర్నర్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ప్రశ్నిస్తున్నారని… రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ఇది పొలిటికల్ కార్యాలయం కాదన్నారు. మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమే ఉన్నాయని, రాజ్‌భవన్‌ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.తమిళిసై రాజ్‌భవన్‌లో మహిళా దర్భార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు గవర్నర్‌కు వివరించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్‌పై కూడా మహిళలు ఫిర్యాదు చేశారు.