Suryapet District Road Accident: పెళ్లైన ఇరవై ఏళ్లకు పుట్టిన కొడుకుకి మురిపెంగా పెళ్లి చేసుకున్నారు ఆ వృద్ధ దంపతులు. కొడుకు, కోడలు ఆసరాతో బతుకుదామనుకున్న తల్లిదండ్రుల కలలు ఎంతో కాలం నిలబడలేదు. రోడ్డు ప్రమాదం వారింట కడుపుకోతను మిగిల్చి, వారి కలలను కాలరాసింది. వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ములకలపల్లి రాములు, మైసమ్మ దంపతులు హైదరాబాద్‌లో నివాసముండేవారు. వాచ్‌మెన్‌గా పని చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. వివాహం జరిగిన 20 యేళ్లకు కుమారుడు వీరభద్రం (25) పుట్టాడు. ఉన్నంతలో కష్టపడి కొడుకును చదివించారు. వీరభద్రం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఉన్న రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్‌లో పని చేస్తుండేవాడు. ఏడాది క్రితం తమ స్వస్థలమైన ఆత్మకూరుకు వచ్చి అనాజిపురానికి చెందిన ప్రణీత(20)తో వీరభద్రంకు వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఆగస్టు 21న ఓ దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది.
ఈ క్రమంలో పెళ్లికి తీసుకున్న వారం రోజుల సెలవులు పూర్తికావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు భార్య ప్రణీతతో కలిసి ఆత్మకూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గం మధ్యలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం టోల్‌గేట్ బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరభద్రం మెడ పైభాగంతో పాటు ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. భార్య ప్రణీతకు చేయి విరిగింది. వైద్యం నిమిత్తం వీరిరువురిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐతే వీరభద్రం అప్పటికే మృతి చెందాడు. వైద్యులు పరీక్షించి ధృవపరచడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అతని భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాళ్ల పారాని ఆరక ముందే, అచ్చటాముచ్చట తీరక ముందే రోడ్డు ప్రమాదం రూపంలో విషాదం ముంచుకురావడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ బాగోగులు చూసుకుంటాడని భావించిన వృద్ధులైన తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలింది.